పోలింగ్ బూత్ వద్ద ఏనుగు కలకలం | Wild Elephant Creates Chaos Outside Polling Booth In Jhargram During West Bengal Elections, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

పోలింగ్ బూత్ వద్ద ఏనుగు కలకలం

Apr 23 2026 11:54 AM | Updated on Apr 23 2026 12:18 PM

Wild Elephant Disrupts Bengal Polls

జార్గ్రామ్‌: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఓటర్ల క్యూ లైన్ల మధ్య ఒక ఊహించని ‘అతిథి’ రాకతో  ఒక్కసారిగా గందరగోళం, ఆశ్చర్యం నెలకొన్నాయి. సాక్షాత్తూ ఒక అడవి ఏనుగు పోలింగ్ బూత్ వద్దకు రావడం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.

జార్గ్రామ్‌లో ఏనుగు టెన్షన్
గురువారం ఉదయం బెంగాల్‌లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. అయితే జార్గ్రామ్‌లోని జితుసోల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్ వెలుపల ఒక అడవి ఏనుగు ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు ఆ గజరాజును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. భారీ సంఖ్యలో గుమిగూడిన జనం ఆ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించడంతో ఆ వీడియోలు నెట్టింట  వైరల్ అయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఉత్కంఠగా తొలి విడత పోలింగ్
ఉదయం 7 గంటల నుంచే ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్, జల్పైగురి నుంచి దక్షిణాన ముర్షిదాబాద్, నాదియా, హుగ్లీ వరకు భారీ క్యూలైన్లు కనిపించాయి. మొత్తం 294 స్థానాలకు గాను సగానికి పైగా సీట్లలో జరుగుతున్న ఈ తొలి దశ ఓటింగ్ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీలకు అత్యంత కీలకం. సుమారు 3.60 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవిఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగలో యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’  వేదికగా పిలుపునిచ్చారు.
 

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు సుమారు 2.5 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలు, వేలాది నిఘా బృందాలను రంగంలోకి దించారు. ఈ తొలి దశలో సువేందు అధికారి, నిసిత్ ప్రామాణిక్, ఉదయన్ గుహ వంటి కీలక నేతల భవితవ్యం తేలనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement