
సాక్షి ముంబై: రాజ్యసభ ఎన్నికల్లో తమ ఒక్క ఓటు కూడా చీలిపోలేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం శివసేన 55వ వార్షికోత్సవాలు ఆన్‌లైన్లో జరిగాయి. కాని ఈ సారి 56వ వార్షికోత్సవాలకు ఉద్ధవ్ ఠాక్రే హాజరై శివసేన కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ముఖ్యంగా విధాన పరిషత్ ఎన్నికల నేపథ్యంలో తనదైన శైలిలో శివసేన ఎమ్మెల్యేలకు సూచనలిచ్చారు. తమ పార్టీ ఓట్లు చీలిపోయే ప్రసక్తేలేదని, ఎందుకంటే శివసేనలో వెన్నుపోటు పొడిచే నాయకులు ఎవరూలేరన్నారు.
అదేవిధంగా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా తమ ఓట్లు చీలలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హోటళ్లలో ఎమ్మెల్యేలను దాచడమంటే ప్రజాస్వామ్యమా అంటూ బీజేపీని నిలదీశారు. మా పార్టీకున్న 56 మంది ఎమ్మెల్యేల గురించి నాకు ఎలాంటి ఆందోళనలేదని స్పష్టం చేశారు. ఓట్ల చీలికల గురించి మాట్లాడుతూ, తల్లిపాలు విక్రయించేవారు మా పార్టీలో ఎవరూ లేరని అందుకే నాకు ఎలాంటి ఆందోళనలేదన్నారు. హిందుత్వం గురించి బీజేపీ పేరు ప్రస్తావించకుండా ఉద్దవ్ ఠాక్రే తనదైన శైలిలో సమాదానం ఇచ్చారు. ‘గర్వ్ సే కహో హమ్ హిందు హై’అనే నినాదాన్ని దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే ఇచ్చారన్నది మరవద్దన్నారు.
చదవండి: విపక్షాలకు దెబ్బ మీద దెబ్బ.. గోపాలకృష్ణ గాంధీ కూడా నో