యోగా విషయంలో రాందేవ్‌ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

యోగా విషయంలో రాందేవ్‌ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు

Published Tue, May 14 2024 5:54 PM

What Ramdev Has Done For Yoga Is Good, But: Supreme Court

న్యూఢిల్లీ: యోగా విషయంలో బాబా రాందేవ్‌ చేస్తున్న కృషి మంచిదే కానీ.. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పతంజలి ఆయుర్వేద సంస్థ, బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణలపై నమోదైన తప్పుడు ప్రకటనల కేసుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. 

యోగా గురువు బాబా రామ్‌దేవ్  ప్రభావం అధికంగా ఉందని. దానిని సరైన మార్గంలో ఉపయోగించాలని బెంచ్ సూచించింది. సుప్రీంకోర్టు జస్టిస్‌లు కోహ్లి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ద్విసభ ధర్మాసనం పేర్కొంది. 
పతంజలి తరపున సీనియర్‌ న్యాయవాది బల్బీర్‌ సింగ్‌ వాదిస్తూ.. తమ ప్రకటనలు ఇంకా ప్రచురిస్తున్న టీవీ ఛానెల్‌లకు పతంజలి లేఖలు రాసిందని, సందేహాస్పద ఉత్పత్తుల అమ్మకాలను పంజలి నిలిపివేసిందని కోర్టు చెప్పారు. 

రామ్‌దేవ్ యోగా కోసం చాలా చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తావించగా..  యోగా కోసం ఆయన ఏం చేశారన్నది మంచిదే కానీ పతంజలి ఉత్పత్తుల విషయం భిన్నమైందని జస్టిస్ హిమ కోహ్లీ తెలిపారు. అలాగే బాబా రామ్‌దేవ్‌, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చింది.

అనంతరం మూడు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పతంజలిని కోరింది. అఫిడవిట్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెనక్కి తీసుకోవడానికి పతంజలి ఎలాంటి చర్యలు తీసుకుంది, ఉత్పత్తుల స్టాక్స్‌ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. రామ్‌దేవ్, బాలకృష్ణలపై కోర్టు ధిక్కరణ కేసుపై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై తదుపరి విచారణ జూలై 9న చేపడతామని పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement