తెలంగాణా శాసనసభలో 'ఇప్ప సారా' తీవ్ర దుమారం రేపింది. బుధవారం నాటి సభలో ఇప్పపువ్వు సారా ఉత్పత్తి చేస్తే.. ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని, మంచి పేరు పెట్టాలంటూ బీజేపీ సభ్యుడు రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.
ఇది ఇలా ఉంటే.. ఇప్పసారాపై ఒక్కసారి ఆసక్తి పెరిగింది. గతంలో గిరిజన ప్రాంతాల్లో లభించే స్వచ్ఛమైన ఇప్ప సారాను తాగిన వారు 100 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించారనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్ప సారా సంగతులేంటో ఒకసారి చూద్దాం.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని ఆదివాసీ సమాజాలు తరతరాలుగా ఇప్పపువ్వుల సారాను వ్యక్తిగత , సామూహిక వినియోగం కోసం తయారు చేసుకుంటారు. ఇప్పపువ్వుతో తయారుచేసే సార (మహువా డ్రింక్) సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో దీనిని ఒక సంప్రదాయ పానీయంగా భావిస్తారు.
గిరిజన సంస్కృతిలో ఇప్ప చెట్టు (Madhuca longifolia)కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎండబెట్టిన పువ్వులను నీటిలో నానబెట్టి, సహజంగా పులియబెడతారు. ఈ పువ్వులలోని సహజ చక్కెరలతో ఆల్కహాల్‌గా మారతాయి. ఇప్ప పువ్వుతో కేవలం మద్యం మాత్రమే కాకుండా లడ్డూలు, బిస్కెట్లు, కేకులు వంటి పోషక ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తారు.
ఇప్ప పువ్వు లడ్డూ
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, పోషకమైన లడ్డూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆదివాసీల సాంప్రదాయ, పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన లడ్డూ. చాలా రుచిగా ఉండటంతోపాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిల్వ కూడా ఉంటాయి. ఇది ఎండు ఇప్ప పూలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, నువ్వులు ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు., రక్తాన్ని శుద్ధి చేయడంలో, మోకాళ్ల నొప్పులు తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఇప్పపువ్వులో ఉండే పోషక విలువలు
ఇప్పపువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలను కలిగి ఉంటాయి
ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది.విటమిన్ సి, కాల్షియం ,ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
దీని లోని ఔషధ గుణాల నేపథ్యంలో ఆయుర్వేదంలో కూడా వాడతారు. ఇప్పపువ్వులను దగ్గు, బ్రోన్కైటిస్ మరియు కండరాల నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు.
ఇక ఇప్పసారా లాభాలు : ఎలాంటి కల్తీలేకుండా, సహజంగా పద్దతుల్లో తయారుచేసిన ఇప్పసారాను నియంత్రిత పద్ధతిలో తీసుకుంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారు.
గిరిజన సంప్రదాయాల ప్రకారం అలసటను తగ్గించడానికి . కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్నిస్తుంది.
ఒంటి వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుందని కొందరు భావిస్తారు.

అతిసర్వత్రా వర్జయేత్..నష్టాలు : లాభాలున్నాయి కదా అని అతిగా ఇప్పసారాని సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అన్ని మద్య పానీయాల మాదిరిగానే దీనికీ నియంత్రణ అవసరం. అంతేకాదు కల్తీ సారా తాగడం ప్రాణాలకే ప్రమాదం.
బయట దొరికే ఇప్పసారాలో మత్తు కోసం యూరియా, అమ్మోనియం సల్ఫేట్ లేదా ఇతర రసాయనాలు కలుపుతారు. ఇది కాలేయం (Liver) , కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. చివరికి మరణానికి దారి తీస్తుంది.
అతిగా సేవించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. ప్రవర్తనలో మార్పులతోపాటు జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.
నోట్ : ఇప్పపువ్వులను ఆహారంగా (లడ్డూలు లేదా పొడి రూపంలో) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, కానీ దానిని 'మద్యం' రూపంలో తీసుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఆరోగ్య సమస్యల కోసం దీనిని వాడాలనుకుంటే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లైసెన్స్ లేకుండా ఇప్పసారా తయారు చేయడం లేదా విక్రయించడం నేరం. మనిషి వందేళ్లు బతకడం ఆర్థిక, భౌగోళిక పరిస్థితులతోపాటు జీవన శైలి, పోషకాహారంతో కూడిన ఆహార అలవాట్లు, జీన్స్ లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది గమనించాలంటున్నారు నిపుణులు.
ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు


