బ్యాంకులు, కేంద్ర సంస్థలకు రఘురామ ఎగనామం

Vijaya sai Reddy Wrote Letter to Narendra Modi Over Raghurama Krishna Issue - Sakshi

ఇండ్‌–భారత్‌ ఆర్థిక మోసాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి

మాల్యా తరహాలో పారిపోకుండా ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వండి

రాష్ట్రపతికి, ప్రధానికి పార్టీ ఎంపీల సంతకాలతో విజయసాయిరెడ్డి లేఖలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి 3 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైన కేసులో ఆ కంపెనీల డైరెక్టర్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌  పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండ్‌–భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ కంపెనీ, అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని,  పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని కోరారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండ్‌ భారత్‌ కంపెనీపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఆ కంపెనీలు దురుద్దేశపూరితంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ మూడు ఎఫ్‌ఐఆర్‌లు రుజువని లేఖలో వివరించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

దురుద్దేశాలను ఒప్పుకుంది..
ఇండ్‌–భారత్‌ లిమిటెడ్‌ 660 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును తమిళనాడులోని ట్యూటికొరిన్‌లో అభివృద్ధి చేసే ప్రతిపాదనతో ప్రభుత్వ సంస్థలు నిధులు సమకూర్చేలా ట్రస్ట్‌ అండ్‌ రిటెన్షన్‌ అగ్రిమెంట్‌(టీఆర్‌ఏ) కుదుర్చుకుందని లేఖలో తెలిపారు. ఇండ్‌–భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్, సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్‌ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.569.43 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నాయని 2016లో పీఎఫ్‌సీకి సమాచారం అందిందన్నారు. 2016 మే 4న ఇండ్‌–భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్టు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఎస్‌బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్షియాన్ని ఇండ్‌–భారత్‌ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందన్నారు.  విజయ్‌ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మోసగించిన సొమ్మును రికవరీ చేసి డైరెక్టర్లను, కంపెనీలను బాధ్యులను చేయాలన్నారు. కంపెనీల డైరెక్టర్లపై కస్టోడియల్‌ విచారణ జరపాలని  కోరారు.

రూ.941.71 కోట్ల ప్రజాధనం స్వాహా..
కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ల నుంచి ఇండ్‌–భారత్‌ పవర్‌(మద్రాస్‌), దాని మాతృసంస్థ ఇండ్‌ భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కె.రఘురామకృష్ణరాజు, మధుసూదన్‌రెడ్డి, వారి గ్రూప్‌ కంపెనీలు రూ.941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్‌ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తెచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top