సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓటర్లకు, తన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో తమను తక్కువ అంచనా వేసిన వారికి ప్రజలు చేతలతో సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు అంటే కేవలం అనుభవం ఉన్న వారికి లేదా పదవులను అనుభవించే వారికి మాత్రమే పరిమితం అని భావించే వారి అంచనాలను సామాన్య ప్రజలు చిత్తు చేశారని విజయ్ వ్యాఖ్యానించారు.
చారిత్రాత్మక పోలింగ్
తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85 శాతం పోలింగ్ నమోదు కావడం ఒక గొప్ప మైలురాయి అని, ఇది నిజమైన ప్రజాస్వామ్య పండుగ అని ఆయన అభివర్ణించారు. రాజకీయాలకు దూరంగా ఉంటారని భావించే యువత, మహిళలు ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేయడం ఒక చారిత్రాత్మక మార్పు అని పేర్కొన్నారు. కేవలం ఓటు వేయడం కోసం విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఖర్చుతో వచ్చిన వారి ప్రజాస్వామ్య స్ఫూర్తికి శిరస్సు వంచి తాను నమస్కరిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు.
పిల్లలకు స్పెషల్ థ్యాంక్స్
కుటుంబసభ్యులను పోలింగ్ కేంద్రాలకు నడిపించిన తన ‘కుట్టి ఫ్రెండ్స్’ (పిల్లలకు) ‘విజయ్ మామ’ ప్రత్యేక ధన్యవాదాలు అని వ్యాఖ్యలు చేశారు. విమర్శకులకు గట్టి కౌంటర్‌గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ వ్యాఖ్యలు చేస్తూ, “వీరికి రాజకీయాల గురించి ఏం తెలుసు? ఎలా తట్టుకోగలరు? అని ఎగతాళి చేసిన వారికి, పోలింగ్ రోజున క్రమశిక్షణతో పని చేసి తమ చేతలతోనే సమాధానం చెప్పారని విజయ్ ప్రశంసించారు. బూత్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన కొనియాడారు. “రాజకీయాలను ఒక నిర్దిష్ట పరిధిలో ఉంచాలనుకున్న వారి అంచనాలు సామాన్య ప్రజల దెబ్బకు చెల్లాచెదురయ్యాయని, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అని ముగించారు.


