బడ్జెట్‌ సమావేశాలపై వెంకయ్య, ఓం బిర్లా సమాలోచనలు

Venkaiah Naidu, LS speaker seek Covid protocol review - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ను సురక్షితంగా ఎలా చేపట్టాలనే అంశంపై సోమవారం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమాలోచనలు జరిపారు. సుమారు 400 మంది పార్లమెంట్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష జరిపి రానున్న బడ్జెట్‌ సెషన్‌ను సురక్షితంగా జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వెంకయ్య, ఓం బిర్లా ఉభయసభల సెక్రటరీ జనరళ్లను ఆదేశించారు.

ఈ మేరకు పార్లమెంట్‌ భవన సముదాయంలో వచ్చే రెండు, మూడు రోజుల్లో విస్తృతంగా డిస్‌ ఇన్ఫెక్షన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు కాకున్నా, సాధారణంగా జనవరి చివరి వారంలో ఈ సెషన్‌ ప్రారంభమవుతుంది. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తూ 2020 వర్షాకాల సెషన్‌లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top