చెన్నై: రైలు ప్రయాణికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘వందే భారత్ స్లీపర్’ రైళ్ల రాక మరింత ఆలస్యం కానుంది. అత్యాధునిక సౌకర్యాలతో, విమాన ప్రయాణ అనుభూతిని అందించే ఈ ప్రతిష్టాత్మక రైళ్ల తయారీలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఈ రైళ్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటున్నవారి నిరీక్షణ ఇప్పట్లో ముగిసేలా లేదు.
ముగిసిన గడువు.. అందని రైళ్లు
మూడేళ్ల క్రితం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)సంస్థకు 10 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్టును ప్రభుత్వం అప్పగించింది. ఒక్కో రైలులో 16 కోచ్‌లు ఉండేలా ఒప్పందం కుదిరింది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా, ఇప్పటివరకు కేవలం రెండు రైళ్లు మాత్రమే పట్టాలెక్కాయి. మిగిలిన ఎనిమిది రైళ్లను ఈ ఏడాది మార్చి నాటికి అందిస్తామని బీఈఎంఎల్ గతంలో హామీ ఇచ్చింది. కానీ, ఆ లక్ష్యాన్ని తర్వాత రెండు రైళ్లకు కుదించినప్పటికీ, నేటికీ ఆ రెండు రైళ్లు కూడా ఐసీఎఫ్ (ఐసీఎఫ్)కు చేరుకోలేదు. అసలు మిగిలిన రైళ్ల పరిస్థితి ఏమిటన్నదానిపై తయారీ సంస్థ నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. రైల్వే శాఖ ఈ జాప్యంపై త్వరగా స్పందించి, స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి మహిళా మంత్రి


