వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. | Vande Bharat Sleeper coach New Addition Indian Railways | Sakshi
Sakshi News home page

వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..

Jun 9 2025 7:34 AM | Updated on Jun 9 2025 7:34 AM

Vande Bharat Sleeper coach New Addition Indian Railways

సాక్షి, అమరావతి: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా దూర ప్రాంతాలకు రాత్రివేళ ప్రయాణానికి ప్రస్తుతం ఉన్న రైళ్ల స్థానంలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను దశలవారీగా ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. కట్టింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీతో మరింత వేగం, సౌకర్యాలతో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ల తయారీ ప్రణాళికను రైల్వే శాఖ ఆమోదించింది.

రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు
సరికొత్త వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల కోసం 1,920 కొత్త కోచ్‌లను భారతీయ రైల్వే నిర్మించనుంది. అందుకోసం రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లను తాజాగా ఖరారు చేసింది. ఈ కాంట్రాక్టును మూడు సంస్థలకు ఇచ్చింది. బీఈఎంఎల్, కినెట్‌ రైల్వే సొల్యూషన్స్, టిట్లాగఢ్‌ రైల్వే సిస్టమ్స్‌ లిమిటెడ్‌–భారత్‌ హెవీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌లతో కూడిన కన్సార్షియానికి టెండర్లు ఖరారు చేసింది.

ఈ సంస్థలు నిర్మించే అధునాతన స్లీపర్‌ కోచ్‌లను 2027 నుంచి దశలవారీగా ప్రవేశపెట్టనుంది. కీనెట్‌ రైల్వే సొల్యూషన్స్‌ ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్‌లోని కోచ్‌ ఫ్యాక్టరీలో వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల నిర్మాణాన్ని మొదలు పెట్టింది. త్వరలోనే అధునాతన వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ నమూనాను ఆవిష్కరిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. కొత్తగా నిర్మించే 1,920 కోచ్‌లు 2027 నుంచి 2029 నాటికి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.   

మరో 11 వందే భారత్‌ ఛెయిర్‌ కార్‌ రైళ్లు..
ఇదిలా ఉండగా.. మరో 11 వందే భారత్‌ రైళ్లు ఛెయిర్‌ కార్‌తో కూడినవి తయారు చేయడానికి లక్ష్యం ఉందని ఇంటిగ్రల్‌ కోచ్‌ ప్యాక్టరీ(ఐసీఎఫ్‌) అధికారి ఒకరన్నారు. ఆ తర్వాత ఛెయిర్‌ కార్‌ బోగీల ఉత్పత్తులు ఆపేసి స్లీపర్‌ కోచ్‌లపై దృష్టి సారించనున్నట్టు చెప్పారు. బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌(బీఈఎంఎల్‌), పెరంబూరులోని ‘ఐసీఎఫ్‌’లో వందేభారత్‌ రైళ్లకు స్లీపర్‌ బోగీలు తయారు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో ఉత్పత్తి పూర్తయిందని, ప్రొటోటైప్‌తో కూడిన రైలును రైల్వే బోర్డుకు త్వరలో అందించనున్నామని, రైల్వే బోర్డు 97 వందే భారత్‌ రైళ్ల తయారీకి ఆర్డరు ఇచ్చిందని ఐసీఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో 86 రైళ్లు తయారీ పూర్తయి డెలివరీ కూడా చేశామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మిగిలిన 11 ఛెయిర్‌ కార్‌ బోగీలను బోర్డుకి అందిస్తామని చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement