ఉన్నావ్‌ కేసు.. కుల్దీప్‌ సెంగర్‌కు బిగ్‌ షాక్‌ | Unnao case: Setback for Kuldeep Sengar | Sakshi
Sakshi News home page

ఉన్నావ్‌ కేసు.. కుల్దీప్‌ సెంగర్‌కు బిగ్‌ షాక్‌

May 15 2026 12:35 PM | Updated on May 15 2026 1:07 PM

Unnao case: Setback for Kuldeep Sengar

సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నావ్‌ అత్యాచార కేసులో కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఢిల్లీ హైకోర్టు సెంగర్‌ జీవితఖైదు శిక్షను సస్పెండ్‌ చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలో శుక్రవారం ఆ ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో సెంగర్‌ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.  

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్‌(బెయిల్‌)ను రద్దు చేయడంతో పాటు.. ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు మెరిట్‌ లోతుల్లోకి తాము వెళ్లదల్చుకోలేదని.. అయితే సెంగర్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపి రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

2017లో వెలుగు చూసిన ఉన్నావో అత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో మైనర్‌గా ఉన్న బాధితురాలిపై అత్యాచారం జరపడంతో పాటు అక్రమ రవాణాకు ప్రయత్నించారని కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌పై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సమయంలో.. ఆ కుటుంబానికి బెదిరింపులు, అనుమానాస్పద స్థితిలో యాక్సిడెంట్‌ జరగడం.. బాధితురాలు ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం.. బంధువులు చనిపోవడం.. ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీంతో కేసు సీబీఐ చేతికి వెళ్లింది.

అదే సమయంలో ఆ అభియోగాల నేపథ్యంలో బీజేపీ ఆయన్ని సస్పెండ్‌ చేసింది. అటుపై ఈ  కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనకు జీవిత ఖైదు విధించింది ట్రయల్‌ కోర్టు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్‌ చేయడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన తల్లి, హక్కుల సంఘం కార్యకర్తలతో కలిసి రాజధాని రోడ్లపై నిరసనకు దిగింది. ఆ సమయంలో అధికారులు వాళ్లను ఈడ్చుకెళ్లిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే బాధితురాలు  న్యాయం కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిశారు. ఈలోపు.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్‌పై సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) వేసింది.

సెంగర్‌కి శిక్ష సస్పెన్షన్‌ ఇవ్వడం నేరం తీవ్రతను తగ్గించేలా ఉందని.బాధితురాలికి గతంలో బెదిరింపులు, ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో బెయిల్‌ అనర్హమని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఇప్పుడు సెంగర్‌ తాత్కాలిక ఉపశమనం సుప్రీం కోర్టు రద్దు చేయడంతో.. ఆయన భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు ఇవ్వబోయే తీర్పుపైనే ఆధారపడి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement