
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మార్గదర్శకాల అమలును మరో నెలపాటు, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశం మొత్తమ్మీద కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అందుకే, రానున్న పండగల సీజన్ సమయంలో ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. అవసరమైతే స్థానికంగా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేశారు. జనసమ్మర్ధం ఉన్నచోట్ల కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కోవిడ్ టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.