అందుకు మోదీ సాయం కోరిన ఉద్ధవ్‌

Uddhav Thackeray Seeks Modi Help To Set Up Infectious Disease Hospital - Sakshi

ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్థవ్‌ ఠాక్రే కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేశారు. అలాగే ముంబై సమీపంలో శాశ్వత అంటువ్యాధుల చికిత్స ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం సాయం కావాలని కూడా కోరారు. నోయిడా, ముంబై, కోల్‌కతాలోని మూడు కేంద్రాల్లో అత్యాధునిక కరోనా టెస్టింగ్‌ సదుపాయాలు కల్పించారు. వీటిని సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఉద్ధవ్‌ మాట్లాడుతూ.. ముంబై సమీపంలో శాశ్వత అంటువ్యాధి చికిత్స ఆస్పత్రిని నిర్మించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇక్కడే పెషేంట్లకు చికిత్సతోపాటు.. పరిశోధన కూడా సాగేలా సదుపాయాలు ఉండాలన్నారు. దీని నిర్మాణం కోసం కేంద్రం మద్దతు, సాయం కావాలని కోరారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ దాటిన కూడా కేంద్రం నుంచి ఇప్పుడు అందుతున్న విధంగానే పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌ల సరఫరా కొనసాగించాలని కోరారు. 

కాగా, ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రాలు కరోనాపై పోరాడేందుకు అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, ఇతర ముఖ్యమైన పరికరాలను కేంద్రం సెప్టెంబర్‌ వరకు అందజేయనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top