దీదీ లోకల్‌ మంత్రం.. కమలం బూత్‌ తంత్రం | Trinamool Congress pledge pillar vs BJP booth plans | Sakshi
Sakshi News home page

దీదీ లోకల్‌ మంత్రం.. కమలం బూత్‌ తంత్రం

Apr 18 2026 5:23 AM | Updated on Apr 18 2026 5:23 AM

Trinamool Congress pledge pillar vs BJP booth plans

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తృణమూల్‌ కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్‌ తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి తృణమూల్‌ను ఎలాగైనా గద్దె దింపి రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ బూత్‌ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. 

తృణమూల్‌ ‘ప్రతిజ్ఞా స్తంభాలు’ 
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ‘స్థానిక మేనిఫెస్టో’లతో తృణమూల్‌ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి మేనిఫెస్టోల్లో హామీలిస్తోంది. డార్జిలింగ్‌ పర్వత ప్రాంతంలో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్లా తృణమూల్‌ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘ప్రతిజ్ఞా స్తంభం’ పేరిట వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. 

స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. వారంక్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా స్తంభాలు, ప్రచార కార్యక్రమాల వీడియోను పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో కూడా పంచుకుంది. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపడం దీని వెనక వ్యూహమని భావిస్తున్నారు. 

గతం నుంచి బీజేపీ పాఠాలు 
ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే, అసలు యుద్ధభూమి అయిన పోలింగ్‌ బూత్‌ల నిర్వహణపై ఈసారి ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్‌ బూత్‌ల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్‌ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్‌లను వదిలి వెళ్లడం ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 

ఈసారి ఆ పరిస్థితి తలెత్తరాదని కార్యకర్తలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్‌ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్‌ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. బూత్‌ మేనేజ్‌మెంట్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు బెంగాల్‌ను బీజేపీ ఐదు భాగాలుగా విభజించింది.

 ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు అనంత్‌ నారాయణ్‌ మిశ్రా, పవన్‌ రాణా, సిద్ధార్థన్, ఎన్‌.మధుకర్, పవన్‌ సాయ్‌కి వాటి బాధ్యతలు అప్పగించింది. వీరంతా గత అక్టోబర్‌ నుంచే క్షేత్రస్థాయిలో మకాం వేశారు. సంస్థాగత లోపాలను సరిదిద్దుతూ బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మూడు నుంచి ఐదు బూత్‌లను కలిపి ఒక ‘శక్తి కేంద్రం’గా ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను రా్రõÙ్టతర నేతలకు అప్పగించారు. నిరంతర సమీక్షలతో బూత్‌ స్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బూత్‌ మేనేజ్‌మెంట్‌లో ఈసారి తృణమూల్‌కు దీటుగా నిలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.

రంగంలోకి ఆరెస్సెస్‌ 
క్షేత్రస్థాయిలో హిందువులను ఏకం చేసేందుకు ఆరెస్సెస్‌ ఆధ్వర్యంలో బెంగాల్‌ అంతటా ముమ్మర ప్రచారం సాగుతోంది. బెంగాలీ హిందువుల ఉనికిని ఈ ఎన్నికలు కీలకమంటూ ప్రచారం చేస్తోంది. ఎన్నికల హింసకు వెరచి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలి. ప్రతి బూత్‌నూ సురక్షితం చేసి, ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలి’’ అని కార్యకర్తలకు సూచిస్తోంది. ఈసారి ఒక్క బూత్‌ నుంచి కూడా తమ కార్యకర్తలను తృణమూల్‌ పారదోలే పరిస్థితి ఉండబోదని ఆరెస్సెస్‌ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఆరెస్సెస్‌ స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు.  
 
శరత్‌ చంద్ర ముక్తవరం 

Advertisement
 
Advertisement
Advertisement