మేలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ పూర్తి | TPCC chief Mahesh Goud discusses appointments in meeting with Rahul Gandhi | Sakshi
Sakshi News home page

మేలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ పూర్తి

Apr 24 2026 3:01 AM | Updated on Apr 24 2026 3:01 AM

TPCC chief Mahesh Goud discusses appointments in meeting with Rahul Gandhi

రాహుల్‌ గాం«దీతో భేటీలో నియామకాలపై టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ చర్చ 

హైదరాబాద్‌లో ఏఐసీసీ ఓబీసీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి 

కులగణన సర్వే ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జరిగిందని వెల్లడి 

బీసీల సంక్షేమానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ మేలో పూర్తికానుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతోపాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు.  

పార్టీ కేడర్‌కు గుర్తింపు.. 
పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని మహేశ్‌గౌడ్‌ తెలిపారు. అందులో భాగంగానే టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గ నియామకంతోపాటు వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్‌ పదవుల భర్తీపై రాహుల్‌ గాందీతో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను మేలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. పార్టీని బూత్‌ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మహేశ్‌గౌడ్‌ చెప్పారు. 

ఏఐసీసీ ఓబీసీ భేటీ హైదరాబాద్‌లో జరపాలి.. 
బీసీల సాధికారతపై కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని దేశవ్యాప్తంగా చాటేలా రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని రాహుల్‌ గాంధీని కోరినట్లు మహేశ్‌గౌడ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటానికి తెలంగాణ వేదికగా మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేన్ల అంశాన్ని కూడా జోడించాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఏ దశలోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

కేసీఆర్‌లా ఒక్కరోజు సర్వే కాదు 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ప్రతిపక్షాల విమర్శలను మహేశ్‌గౌడ్‌ ఖండించారు. సర్వే ప్రక్రియలో ఎక్కడా లోపం జరగలేదని.. అత్యంత శాస్త్రీయంగా వివరాల నమోదు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హడావుడిగా ఒక్క రోజులోనే సర్వే చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అలా చేయలేదని.. ఎన్యూమరేటర్లు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా వివరాలు సేకరించారని వివరించారు. ఈ వాస్తవ డేటా ఆధారంగానే భవిష్యత్తులో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికి సామాజిక న్యాయం దక్కాలన్న రాహుల్‌ గాంధీ ఆశయాన్ని తెలంగాణలో 100 శాతం అమలు చేసి తీరుతామని మహేశ్‌గౌడ్‌ ఉద్ఘాటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement