Restore Old Pension Plan: త్వరలో ఉద్యోగులకు సీఎం స్టాలిన్‌ శుభవార్త?

Tamil Nadu: DMK Govt Plans To Restoration Of Employees Old Pension - Sakshi

సాక్షి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మరి కొద్దిరోజుల్లో శుభవార్తను అందించేందుకు సీఎం ఎంకే స్టాలిన్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడానికి తగిన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2003లో అన్నాడీఎంకే అధికారంలో ఉన్న సమయంలో పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కారణంగా అనేక రాయితీలను ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ గత 19 సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాడుతూనే ఉన్నారు. కొత్త విధానం కారణంగా పదవీ విరమణ పెన్షన్‌ను, వైద్య భీమాను కోల్పోయామని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఈ పరిస్థితులు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌ గడ్‌ వంటి రాష్ట్రాలు కొత్త విధానాన్ని రద్దు చేసి పాత విధానం మీద దృష్టి పెట్టాయి. అలాగే, మరికొన్ని రాష్ట్రాలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ఉద్యోగుల సంఘం ప్రభుత్వం ముందు తమ విజ్ఞప్తిని ఉంచుతూ లేఖాస్త్రం సందించింది. ఇందుకు ఆర్థిక కార్యదర్శి గోపాలకృష్ణన్‌ సమాధానం ఇస్తూ పేర్కొన్న అంశాలు ఉద్యోగుల్లో ఆశలు రెకెత్తించారు. 19 సంవత్సరాల పాటుగా జరిగిన పోరాటానికి ఫలితం దక్కబోతోందన్న ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి: హనుమాన్‌ శోభాయాత్రలో హింస

గోపాల కృష్ణన్‌ పంపిన ప్రకటనలో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్టు, పాత పెన్షన్‌ విధానం అమలుకు తగ్గట్టుగా పరిశీలన జరుగుతున్నట్లు వివరించారు. పాత పెన్షన్‌ విధానం అమలుకు తగ్గ సాధ్యాసాధ్యాల పరిశీలనకు నియమించిన కమిటీ తన సిఫారసుల్ని సీఎం స్టాలిన్‌కు సమర్పించినట్టు వివరించారు. త్వరలో మంచి నిర్ణయం ఉంటుందని, ఇందుకు తగ్గ ఉత్తర్వులు జారీ అవుతాయని ఆ ప్రకటనలో పేర్కొనడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఎదురుచూపులు పెరిగాయి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top