కమల్‌నాథ్‌ స్టార్‌క్యాంపెయినర్‌ కాదనే అధికారం ఈసీకి లేదు

Supreme Court stays EC revocation of Kamal Nath star campaigner status - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీ మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి తొలగిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నాయకుడి ప్రచార స్థాయిని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కి లేదని కోర్టు స్పష్టం చేసింది.

తనని స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి తొలగించడాన్ని కమల్‌నాథ్‌ కోర్టులో సవాల్‌ చేశారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసి, మంగళవారం ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్‌నాథ్‌ ఎన్నికల కమిషన్‌ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ చెల్లుబాటు కాదని, ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం తాము చర్యలు చేపట్టామని కమిషన్‌ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ద్వివేదీ కోర్టుకి తెలిపారు.

అయితే ఒక నాయకుడి ప్రచార స్థాయిని నిర్ణయించే అధికారం ఈసీకి ఉందా? అంటూ కమల్‌నాథ్‌ లేవనెత్తిన ప్రశ్నతో సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారించింది. వారి నాయకుడెవరో నిర్ణయించే అధికారం ఆ పార్టీకే ఉంటుంది తప్ప, ఆ అధికారం ఈసీ కి ఉండదని ఈసీ తరఫున హాజరైన న్యాయవాదికి కోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్‌ 13న కమల్‌నాథ్‌ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన ఉపన్యాసంపై ఆధారపడి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు జారీచేసిందని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు.

‘బాబ్రీ’ మాజీ జడ్జికి భద్రత పొడిగింపు కుదరదు
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ సీనియర్‌ నాయకులు ఆడ్వాణీసహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన మాజీ ప్రత్యేక జడ్జి జస్టిస్‌ ఎస్‌కే యాదవ్‌కు భద్రత పొడిగించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాబ్రీ కేసు సున్నితమైన అంశం కనుక, అటువంటి కేసులో తాను తీర్పునిచ్చినందున తనకు వ్యక్తిగత భద్రత కొనసాగించాలంటూ జస్టిస్‌ యాదవ్‌ సుప్రీంకోర్టును కోరారు. లేఖలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా భద్రత పొడిగింపు సాధ్యం కాదని కోర్టు త్రిసభ్య బెంచ్‌ తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top