వ్యాక్సినేషన్‌: కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం

Supreme Court Serious On Central Government Vaccination System - Sakshi

న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్‌ విధానంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్‌ పాలసీలో ఎన్నో లోపాలున్నాయని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలకు వ్యాక్సిన్‌ విక్రయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వచ్చే డిసెంబర్‌ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇస్తారా? అని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని.. కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌పై పునరాలోచించాలని తెలిపింది. అనంతరం కేంద్రం స్పందిస్తూ.. డిసెంబర్‌ 31 నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ చేస్తామని, ఫైజర్‌లాంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. 

సహేతుకంగా లేదు
దేశ ప్రజలందరికీ ప్రభుత్వం ఎందుకు టీకా ఇవ్వకూడదంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్లు అందించే బాధ్యత కేంద్రం తీసుకుందని,  18 నుంచి 44 ఏళ్ల వాళ్లకు టీకా ఇచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు వదిలేశారని కేంద్రాన్ని  సుప్రీం ప్రశ్నించింది. వ్యాక్సిన్ల ధరలను కేంద్రానికి ఒక రేటు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రేటు , ప్రైవేటు ఆస్పత్రులకు మరో రేటు పెట్టడం వెనుక సహేతుక కారణం కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. 

కొవిడ్‌ బారిన యువత
ఓవైపు 45 ఏళ్లు పైబడిన వారికే టీకాలు ఇవ్వడంపై కేంద్రం దృష్టి పెట్టిందని, మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌లో 18 నుంచి 44 ఏళ్లలోపు వారే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని కోర్టు పేర్కొంది. 45 ఏళ్లు పైబడిన వారికే కాకుండా అందరికీ టీకాలు ఇస్తే బాగుండేదంటూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.  

కేంద్రం బాధ్యత లేదా
వ్యాక్సిన్ల ధర నిర్ణయించే అధికారం తయారీ సంస్థలకే ఎందుకు వదిలేశారంటూ ప్రశ్నించింది సుప్రీం. వ్యాక్సిన్‌కు ఏకరూప ధరను నిర్ణయించే బాధ్యతను కేంద్రం ఎందుకు తీసుకోకూడదని అడిగింది. మరోవైపు కేంద్రం ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా గ్లోబల్‌ టెండర్లకు వెళ్లడం ఏంటని నిలదీసింది.  

రూరల్‌కి యాక్సెస్‌ ఉందా 
కొవిడ్‌ టీకా తీసుకోవాలంటే కోవిన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. గ్రామీణ భారత్‌లో ఉన్న ప్రజలందరికీ ఇంటర్నెట్‌ సౌకర్యం  అందుబాటులో ఉందా ? వారు కోవిన్‌ యాప్‌లో ద్వారా టీకా పొందడం సాధ్యమేనా అని ప్రశ్నించింది. ఇదే విషయం వలస కార్మికులకు కూడా  వర్తిస్తుందని పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top