ఆప్‌పై సుకేశ్‌ చంద్రశేఖర్‌ మరోసారి సంచలన ఆరోపణలు.. ఢిల్లీ మంత్రికి రూ.60 కోట్లు ఇచ్చానంటూ..

Sukesh Chandrasekhar Alleges of Giving Rs 60 Crore To AAP leaders - Sakshi

న్యూఢిల్లీ: రూ. 200 కోట్ల మానీలాండరింగ్‌ కేసులో  ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న కాన్‌మన్‌ సుకేశ్‌ చంద్రశేఖర్‌.. గత కొంతకాలంగా ఆమ్‌ ఆద్మీ పార్టీని టార్గెట్‌ చేశాడు. తాజాగా మరోసారి ఆప్‌ పార్టీపై, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. పార్టీ నేత సత్యేంద్ర జైన్‌కు రూ. 60 కోట్లు ఇచ్చిన్నట్లు పేర్కొన్నాడు. అంతేగాక పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను సైతం కలిసినట్లు తెలిపాడు. 

మనీలాండరింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ను మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఉన్నతస్థాయి కమిటీ సుకేశ్‌ వాంగ్మూలాన్ని స్వీకరించిందని, దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందని అతని తరపు న్యాయవాది అనంత్‌ మాలిక్‌ మీడియాకు తెలిపారు. తనను రాజ్యసభకు నామినేట్ చేస్తానని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత జైన్‌కు 2016లో అసోలాలోని తన ఫామ్‌హౌజ్‌లో రూ.50 కోట్లకు పైగా ఇచ్చానని సుకేశ్‌ తెలిపాడు. తర్వాత హయత్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కేజ్రీవాల్ జైన్‌తో కలిసి  పాల్గొన్నారని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. 

అంతేగాక 2019లో జైలులో తన భద్రత కోసం జైన్  రూ. 10 కోట్లు వసూలు చేశాడని చంద్రశేఖర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాసిన లేఖలో ఆరోపించారు.పార్టీ కోసం 20 మంది వ్యక్తులను వెతికి వారి నుంచి పార్టీ కోసం 500 కోట్ల ఫండ్‌ సమకూర్చాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసినట్లు ఆరోపించాడు. సత్యేంద్ర జైన్‌ తనను బెదిరించారని తెలిపాడు.  అప్పటి జైళ్ల శాఖ డీసీ సందీప్ గోయెల్‌కు రూ.12.50 కోట్లు చెల్లించినట్లు కూడా పేర్కొన్నాడు. తాను నేరస్థుడు అని భావిస్తే.. నా నుంచి రూ.50 కోట్లు ఎందుకు స్వీకరించారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. అయితే చంద్రశేఖర్‌ ఆరోపణలు అబద్దమని ఆప్‌ కొట్టిపారేసింది. ఇవన్నీ బీజేపీ ఆడుతున్న నాటకాలని విమర్శించింది.
చదవండి: యూనిఫామ్‌ ఉందని మరిచారా సార్‌! మహిళతో ఎస్సై డ్యాన్స్‌ వీడియో వైరల్‌

కాగా ఇదే కేసులో బాలీవుడ్‌ నటులు నోరా ఫతేహి, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విలువైన బంగ్లాతో పాటు విలువైన కానుకలు సుకేశ్‌ స్వీకరించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఈడీతో పాటు ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top