ఈ యాప్స్‌తో ఒత్తిడి పరార్‌..!

Stress Buster Online Apps Like Hago And Inspire Pro - Sakshi

డిజిటల్‌ వరల్డ్‌ ఐసోలేషన్లు, అంబులెన్స్‌ చప్పుళ్లు... స్ట్రెస్‌గా ఫీలవుతున్నారా? జోష్‌ మిస్సయిందా?అల్లావుద్దీన్‌ అద్భుతదీపంలాంటి ‘యాప్స్‌’ మీ దగ్గరే ఉన్నాయి. మీ మనసులో మాట చెప్పండి చాలు...‘జీ హుజూరు’ అని ఒత్తిడిని మాయం చేస్తాయి. మాయాతివాచీ మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకొని రాగాల ప్రపంచంలోకి తీసుకువెళతాయి. రంగులతో బొమ్మలు వేయిస్తాయి. సవాల్‌ దూసే ఆటలకు సై అనేలా చేస్తాయి. టోటల్‌గా జోష్‌ను టన్నుల కొద్దీ ఇస్తాయి...

జోరుగా....హాయి హాయిగా!
‘కరెంటు తీగలా ఎనర్జిటిక్‌గా ఉండేవాడివి...అదేంటి బ్రో ఇలా కనిపిస్తున్నావు!’ అనే పలకరింపుకు అటు నుంచి ఒక నవ్వు అయితే వినిపించిందిగానీ అది జీవం లేని నవ్వు. జోష్‌లేని జీరో నవ్వు! పైకి ఎంత గంభీరంగా కనిపించినా ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, నిద్రలేమి...మొదలైన సమస్యలతో డీలా పడిపోతున్న కుర్రకారు సంఖ్య తక్కువేమీ లేదు. డీలా పడిపోకుండా సమస్యను ఢీ కొట్టాడానికి అందుబాటులో ఉన్న ఫీల్‌గుడ్‌ యాప్స్‌లో ఒకటి ‘ఎన్‌స్మైల్స్‌’  ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న కనిపించే, కనిపించని మానసిక సమస్యలపై కత్తిదూసే సెల్ఫ్‌–హెల్ప్‌ టూల్స్‌ ఇందులో ఉన్నాయి. నిద్ర లేమి నుంచి కెరీర్‌ మెనేజ్‌మెంట్‌ వరకు నిపుణుల సలహాలు, సూచనలు ఇందులో కనిపిస్తాయి.

‘ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల  కార్ఖానా’ అంటారు కదా! ఈ సమయంలో మెదడుకు ఎంత పని కలిపిస్తే అంత మంచిది. దీనికి కొత్త భాష నేర్చుకుంటే మరీ మంచిది. మోస్ట్‌ పాప్‌లర్‌ లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్‌గా పేరున్న ‘డ్యుయో లింగో’లో స్పానీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, జపనీస్‌....మొదలైన భాషలు నేర్చుకోవచ్చు. అకాడమిక్‌ పాఠాల మాదిరిగా కాకుండా గేమ్‌–లైక్‌ ట్రిక్స్‌తో కొత్త భాష నేర్చుకోవచ్చు.

అలా కళ్లు మూసుకొని, రిలాక్స్‌ అవుతూ పుస్తకం చదవాలని...సారీ వినాలని ఉందా? అందుకు ‘ఆడిబుల్‌’ యాప్‌ ఉంది. అమెజాన్‌ వారి ఈ ఆడియోబుక్‌ సర్వీస్‌లో ఎన్నో పుస్తకాలు వినవచ్చు. కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలంటారా? అయితే ఇదే కంపెనీ వారి ‘ఆడిబుల్‌ సునో’ ఉంది. బాలీవుడ్‌ నుంచి టీవి సెలబ్రిటీల వరకు ఎన్నో గొంతులు వినొచ్చు. కామెడీతో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఆసక్తి కలిగించే సినిమా, ఆటల కబుర్లు హాయిగా వినవచ్చు.

గూగుల్‌ ప్లేస్టోర్‌లో హైయెస్ట్‌–రేటెడ్‌ యాప్‌లలో ఒకటైన ‘కలర్‌ఫై’ రిలాక్స్‌ కావడానికి ఉపకరించే యాప్‌. మనల్ని వేలు పట్టుకొని బాల్యంలోకి తీసుకువెళుతుంది. పూలతోటలు, జంతుజాలం, ప్రముఖ చిత్రాలు, ప్రముఖుల చిత్రాలకు రకరకాల రంగులు వేయవచ్చు. స్ట్రెస్, అకారణ ఆందోళల నుంచి బయటపడడానికి కలరింగ్‌ యాప్స్‌ బెస్ట్‌ అని సూచిస్తున్నారు మెంటల్‌ హెల్త్‌ ప్రొఫెషనల్స్‌.

ప్రపంచవ్యాప్తంగా పేరున్న సోషల్‌ గేమింగ్‌ యాప్‌లలో ‘హగో’ ఒకటి. మనదేశంలో కూడా ప్రాచుర్యం పొందింది. ‘ప్లే విత్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ మేక్‌ ఫ్రెండ్స్‌’ అని ఆహ్వానిస్తోంది. బ్రెయిన్‌ క్విజ్‌ (బ్రెయిన్‌ పవర్‌ను చెక్‌ చేసుకునే గేమ్‌) మొదలు క్రేజీ ట్యాక్సీలాంటి మైండ్‌ బ్లోయింగ్‌ గేమ్స్‌ వరకు ఎన్నో గేమ్స్‌ ఇందులో ఉన్నాయి. పాత గేమ్స్‌నే పదేపదే ఆడనక్కర్లేదు. ప్రతిరోజూ కొత్త గేమ్స్‌ లైబ్రరీలో చేరుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా మీలాగే గేమ్స్‌ ఆడేవారితో కనెక్ట్‌ కావచ్చు.

బొమ్మలు వేయాలని ఎవరికి మాత్రం ఉండదు!
మీ ఐఫోన్‌నే కాన్వాస్‌గా చేసుకొని ఆయిల్‌ పెయింటింగ్‌ నుంచి డిజిటల్‌ ఆర్ట్‌ వరకు కుంచెలను కదిలించడానికి ‘ఇన్‌స్పైర్‌ ప్రో’ ఉంది. ఉదాహరణ కోసం గ్యాలరీలో బోలెడు చిత్రాలు ఉన్నాయి. ఎయిర్‌ బ్రషెస్‌ నుంచి గ్రాఫిటీ పెన్సిల్స్‌ వరకు ఎన్నో టూల్స్‌ ఉన్నాయి. ఇక ఇల్లే చిత్రశాల అవుతుంది.

లాక్‌డౌన్, ఐసోలేషన్‌లతో బాహ్య ప్రపంచం దూరమైపోయిందని బాధ అక్కర్లేదు. యాప్‌ ప్రపంచంలోకి అడుగుపెడితే ఒకటి కాదు ఎన్నో ప్రపంచాలు స్వాగతం పలుకుతాయి. నిరుత్తేజ క్షణాల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top