సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్‌ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
కాగా, భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.
సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.


