‘రాహుల్‌కు కాంగ్రెస్‌ కట్టప్పల ద్రోహం’ | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు కాంగ్రెస్‌ సీనియర్ల వెన్నుపోటు

Published Thu, Aug 27 2020 7:41 PM

Shiv Sena Says Old Guards Have Sabotaged Rahul Gandhi - Sakshi

ముంబై : పార్టీకి పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్‌ చేస్తూ సోనియా గాంధీకి 23 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు రాసిన లేఖపై శివసేన స్పందించింది. రాహుల్‌ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్‌ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని ఆరోపించింది. రాహుల్‌ గాంధీపై బీజేపీ చవకబారు వ్యాఖ్యలు, దాడులు చేసినప్పుడు వీరంతా ఎక్కడున్నారని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం నిలదీసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ వైదొలగిన అనంతరం పార్టీని పునరుద్ధరించే సవాల్‌ను వీరు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. రాహుల్‌ నాయకత్వాన్ని తుదముట్టించేందుకే వీరు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించింది. ఈ పాతకాపులు రాహుల్‌ గాంధీని వెన్నుపోటుపొడిచారని, బీజేపీ తలపెట్టని హాని సైతం వీరు రాహుల్‌కు తలపెట్టారని దుయ్యబట్టింది. వీరిలో చాలామందికి జిల్లా నేతల స్ధాయి కూడా లేకున్నా గాంధీ, నెహ్రూ కుటుంబాల అండతో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారని శివసేన వ్యాఖ్యానించింది.

అన్ని రాష్ట్రాల్లోనూ దిగ్గజ నేతలు పార్టీ పట్ల ఆసక్తి చూపకుండా కేవలం తమ పదవుల పట్లే ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. పదవులు రానివారంతా బీజేపీ వైపు మళ్లుతున్నారని, ఈ పరిస్ధితుల్లో రాహుల్‌, సోనియా ఏం చేస్తారని ప్రశ్నించింది. పదవులు రాకుంటే పార్టీలు మారడం కొత్తతరహా రాజకీయ కరోనా వైరస్‌గా పరిణమించిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో బీజేపీతో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ఉద్థవ్‌ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా సోనియాకు సీనియర్‌ నేతల లేఖపై కాంగ్రెస్‌లో పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే. సీనియర్‌ నేతల లేఖపై సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం, అసంతృప్త నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించడంతో గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌ వంటి నేతలు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఇక సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆ తర్వాత రాహుల్‌ వివరణ ఇవ్వాల్సివచ్చింది. మరోవైపు పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగుతారని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. చదవండి : కేంద్రంపై రాహుల్ మ‌రోసారి ఫైర్

Advertisement

తప్పక చదవండి

Advertisement