
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వినాయకచవితి వేడుకలు, ఓనం ఉత్సవాల నేపధ్యంలో పలు రాష్ట్రాలోని పాఠశాలలకు ఆగస్టు 28(గురువారం) సెలవు ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వాతావరణ శాఖ కూడా పలు రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు చేసింది. దీనిని గమనించిన ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఏఏ రాష్ట్రాల్లో నేడు(గురువారం) సెలవు ప్రకటించారనే విషయానికొస్తే..
పంజాబ్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం నుంచి ఆగస్టు 31 పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులను పొడిగించే అవకాశం కూడా ఉంది. రుతుపవనాలకు రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్రంలోని రంజిత్ సాగర్, భాక్రా ఆనకట్టల నుండి నీటి విడుదల, సట్లూజ్, బియాస్, రావి వంటి నదులలో నీటి మట్టాలు పెరగడం కారణంగా పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి.
ఉత్తరాఖండ్, జమ్ము
జమ్మూలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో వరదలు సంభవించాయి. కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 28న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దక్షిణాదిన..
దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఆగస్టు 28న సెలవు ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గోవా, కేరళలలో గణేష్ చతుర్థిని ఆగస్టు 27న జరుపుకున్నారు. అయితే వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో 28న సెలవు ప్రకటించే అవకాశం ఉంది. కేరళలో ఓణం వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి.నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.