పునీత్‌ పేరుతో పాఠశాల, ఆస్పత్రి 

School And Hospital Started In the Name Of Puneeth Rajkumar In Karnataka - Sakshi

సాక్షి బళ్లారి(కర్ణాటక): అద్భుత నటనతో పాటు సామాజిక సేవలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన పునీత్‌రాజ్‌కుమార్‌ మరణం యావత్తు కర్ణాటక ప్రజలను దుఃఖ సాగరంలో నింపిందని, ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువేనని కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన బెళగల్‌ క్రాస్‌లోని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమంలో పునీత్‌రాజ్‌కుమార్‌ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బళ్లారి నగరంలో పునీత్‌రాజ్‌కుమార్‌ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామన్నారు. తమ సొంత నిధులతో పేదలకు ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వినయ విధేయతలకు పునీత్‌ మారుపేరుగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలిసోమశేఖరెడ్డి, బుడా చైర్మన్‌ పాలన్న, గాలిజనార్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ తదితరులు పాల్గొన్నారు.   

ఇకపై బళ్లారిలోనే ఉంటా: 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకపై బళ్లారిలోనే ఉంటానని కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను పర్మనెంటుగా బళ్లారిలోనే ఉండవచ్చునని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బళ్లారిలోనే ఉంటూ సేవా కార్యక్రమాలను చేపడుతామన్నారు.  

రాయల్‌ బస్టాండుకు పునీత్‌ పేరు 
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలిసోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పునీత్‌ మరణం తీరనిలోటని, పునీత్‌తో తమకు ఎంతో అవినాభవ సంబంధం ఉందని గుర్తు చేసుకొన్నారు. నగరంలోని రాయల్‌ బస్టాండ్‌కు పునీత్‌ పేరు పెడతామని అన్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top