ఆయుర్వేద వైద్యుడికి సుప్రీంకోర్టు షాక్!

SC Fines Ayurveda Doctor Claiming For He Has Developed Cure For Corona - Sakshi

కరోనాకు మందు కనిపెట్టానంటూ కోర్టుకెక్కిన ఆయుర్వేద వైద్యుడు

పబ్లిసిటీ కోసమే ఇదంతా: సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నివారణకు మందు కనిపెట్టానంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఓ ఆయుర్వేద వైద్యుడికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేసినందుకు రూ. 10 వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కింద జమచేయాలని ఆదేశించింది. వివరాలు... హర్యానాకు చెందిన ఓంప్రకాశ్‌ వేద్‌ జ్ఞాన్‌తారా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడికల్‌ అండ్‌ సర్జరీ(బీఏఎంఎస్‌)లో పట్టా పుచ్చుకున్నాడు. ప్రాణాంతక కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌కు విరుగుడు మందు తయారు చేసినట్లు ప్రకటించాడు. (ఈ చెత్తనంతా భరించలేం: సుప్రీంకోర్టు)

అంతేగాక తాను కనిపెట్టిన ఈ దేశీ ఔషధాన్ని కరోనా చికిత్సకు ఉపయోగించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖను ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ ఔషధాన్ని అందరు డాక్టర్లు ఉపయోగించేలా, ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరాడు. ఈ మేరకు జ్ఞాన్‌తారా పిల్‌ దాఖలు చేశాడు. దీనిపై  విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌ కే కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా కారణంగా తలెత్తిన కఠిన పరిస్థితుల్లో పబ్లిసిటీ కోసమే పిటిషనర్‌ ఇలాంటి అభ్యర్థనతో కోర్టుకు వచ్చారని, దీనిని ఎంతమాత్రం సహించబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయడం సరికాదని పేర్కొంటూ రూ. 10 వేల జరిమానా విధించింది. ఇక ముందు మరెవరూ ఇలాంటి పిటిషన్లతో న్యాయస్థానానికి రావొద్దంటూ విజ్ఞప్తి చేసింది. (అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారు: సుప్రీంకోర్టు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top