బెంగళూరు: చదువుకోవాల్సిన వయసులో ప్రేమ పాశానికి గురైన యువతి బతుకును చిదిమేసుకుంది. బెంగళూరు శాంకీ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చిక్కబాణవార నివాసి పి.తేజస్విని రాజ్ (20) గా సదాశివనగర పోలీసులు గుర్తించారు. వివరాలు.. తేజస్విని చిక్కబాణవారలోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం కాలేజీ నుంచి శాంకీ చెరువు వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రియునికి మెసేజ్ చేసింది.
అతను తేజస్విని తల్లికి విషయం చెప్పాడు. ఆమె సదాశివనగర పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, కుటుంబసభ్యులు చెరువు వద్దకు వచ్చి అర్ధరాత్రి వరకు గాలించారు. మంగళవారం ఉదయం చెరువులో తేజస్విని మృతదేహం బయటపడింది. సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా సోమవారం సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు చెరువు ఆవరణలో తిరిగిన తేజస్విని రాత్రి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
ఈ జీవితం చాలు...
తన ప్రియునికి.. తన జీవితం చాలు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పంపించి మొబైల్ స్విచ్చాఫ్ చేసినట్లు వెల్లడైంది. ప్రేమ గొడవే కారణమని దర్యాప్తులో వెలుగుచూసింది. ఆమె కాలేజీలో యువకున్ని ప్రేమించింది, తల్లిదండ్రులు.. నీది ఇంకా చిన్న వయసు, ప్రేమించడానికి సమయం ఉంది. మొదట చదువుకోవాలని మందలించారు. కొన్నాళ్లనుంచి ప్రేమికులు దూరంగా ఉన్నారు. ఈ ఆవేదనతోనే చెరువులోకి దూకి చనిపోయిందని తేలింది.


