క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం

RJD Chief Lalu Prasad Yadav shifted to AIIMS Delhi as health worsens - Sakshi

రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్‌ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌(72) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శనివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ వివిధ ఆరోగ్య సమస్యలతో రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)లో చికిత్స పొందుతున్నారు. ‘ఆయనకు న్యుమోనియా సోకింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని నిర్ణయించాం. ఎయిమ్స్‌ నిపుణులను ఇప్పటికే సంప్రదించాం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ నుంచి నివేదిక అందిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్తాం’ అని రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కామేశ్వర్‌ ప్రసాద్‌ శనివారం సాయంత్రం తెలిపారు.

అధికారులు, లాలూ కుటుంబసభ్యులు ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేకంగా ఎయిర్‌ అంబులెన్సును ఏర్పాటు చేశారని కూడా ఆయన వెల్లడించారు. లాలూను ఢిల్లీకి తరలించేందుకు రాంచీ జైలు అధికారులు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, కుమారులు తేజ్‌ ప్రతాప్, తేజస్వి శుక్రవారం రాత్రి ఆయనను కలుసుకున్నారు. అనంతరం తేజస్వీ యాదవ్‌ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో భేటీ అయి, తమ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం అర్థించారు. రిమ్స్‌లో ఉండగా లాలూ జైలు నిబంధనలను అతిక్రమించారన్న కేసుపై జార్ఖండ్‌ హైకోర్టు  విచారణ జరిపింది. ఈ విషయంలో ఆస్పత్రి యంత్రాంగం, జైలు అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top