breaking news
Feeding scandal
-
దాణా కేసులో లాలూకు బెయిల్
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు(73) జార్ఖండ్ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే సగం జైలు శిక్షను పూర్తి చేసుకోవడంతో న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెయిల్ మంజూరు చేశారు. పాస్‌పోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని, అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని లాలూను ఆదేశించారు. బెయిల్‌పై బయట ఉన్నంత కాలం చిరునామా, ఫోన్ నంబర్ మార్చొద్దని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఒక కేసుల్లో, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన మరో కేసులో రూ.5 లక్షల చొప్పున జరిమానాలను డిపాజిట్ చేయాలని, రూ.లక్ష చొప్పున విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ లాలూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. లాలూ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సగం శిక్షా కాలం పూర్తిచేసుకోవడంతో బెయిల్‌కు అర్హుడేనని పేర్కొన్నారు. లాలూకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను సీబీఐ తరపు న్యాయవాది రాజీవ్ సిన్హా వ్యతిరేకించారు. అయినప్పటికీ బెయిల్ ఇవ్వడానికే న్యాయస్థానం మొగ్గుచూపింది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో లాలూ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. లాంఛనాలన్నీ పూర్తయ్యాక సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయని లాలూ తరఫు న్యాయవాది దేవర్షి మండల్ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అధికారికంగా ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా 39 నెలల 25 రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. మరో మూడు కేసుల్లో గతంలోనే బెయిల్ దాణా కుంభకోణంలో(దుమ్కా ట్రెజరీ కేసు) లాలూ ప్రసాద్ యాదవ్‌కు 2018 మార్చి 24న రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 14 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఒక కేసులో రూ.60 లక్షలు, మరో కేసులో రూ.30 లక్షల జరిమానా విధించింది. 1990వ దశకంలో దాణా కొనుగోలు, పంపిణీకి సంబంధించి దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూతోపాటు ఇతరులపై కేసు నమోదయ్యింది. ఇదే దాణా కుంభకోణానికి సంబంధించిన దేవ్‌గఢ్, చైబాసా, డోరందా ట్రెజరీ కేసుల్లో ఆయనకు గతంలోనే బెయిల్ లభించింది. దుమ్కా ట్రెజరీ కేసులో కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. తమ పార్టీ అధినేత జైలు నుంచి విడుదల కానుండడంతో ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం
రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(72) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శనివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ వివిధ ఆరోగ్య సమస్యలతో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ‘ఆయనకు న్యుమోనియా సోకింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని నిర్ణయించాం. ఎయిమ్స్ నిపుణులను ఇప్పటికే సంప్రదించాం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ నుంచి నివేదిక అందిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్తాం’ అని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ శనివారం సాయంత్రం తెలిపారు. అధికారులు, లాలూ కుటుంబసభ్యులు ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సును ఏర్పాటు చేశారని కూడా ఆయన వెల్లడించారు. లాలూను ఢిల్లీకి తరలించేందుకు రాంచీ జైలు అధికారులు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి శుక్రవారం రాత్రి ఆయనను కలుసుకున్నారు. అనంతరం తేజస్వీ యాదవ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయి, తమ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం అర్థించారు. రిమ్స్‌లో ఉండగా లాలూ జైలు నిబంధనలను అతిక్రమించారన్న కేసుపై జార్ఖండ్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో ఆస్పత్రి యంత్రాంగం, జైలు అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. -
దాణాకేసులో 23 మందికి జైలుశిక్ష
రాంచీ: కోట్లాది రూపాయల దాణా కుంభకోణంలో నిందితులైన 23 మందిని సీబీఐ ప్రత్యేకకోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. సంశయలాభం కింద మరో పదిమందిని నిర్దోషులుగా పేర్కొంది. 1981-1990 సంవత్సరాల మధ్య బీహార్‌లో పశుదాణా కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే.7.6 కోట్ల రూపాయలను స్వాహా చేసిన ఆర్సీ54 ఏ96 కేసులో విచారణ పూర్తి చేసిన సీబీఐకోర్టు న్యాయమూర్తి బీకే గౌతం శనివారం తీర్పు వెలువరించారు. నలుగురు అధికారులు, 19 మంది దాణా సరఫరాదారులు ఈ కేసులో దోషులని ఆయన పేర్కొన్నారు.వారిలో కొందరికి మూడేళ్లు, మరికొందరికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు.