రఫేల్‌ రాక చారిత్రాత్మక క్షణం: రాజ్‌నాథ్‌ సింగ్‌

Rajnath Singh On Induction Of 5 Rafale Jets - Sakshi

రఫేల్‌ రాకతో ప్రపంచానికి బలమైన సందేశం

అంబాలా, హరియాణా : సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అమ్ముల పొదిలోకి ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రఫేల్‌ రాకను గేమ్‌ చేంజర్‌గా వర్ణించారు. భారత వైమానిక దళంలోకి రఫేల్‌ జెట్లను ప్రవేశపెట్టడం చారిత్రాత్మక క్షణంగా వర్ణించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘రఫేల్‌ రాకతో ప్రపంచానికి ముఖ్యంగా మనల్ని వక్ర దృష్టితో చూసే ధైర్యం చేసేవారికి ఒక బలమైన సందేశాన్ని పంపుతున్నాం. ప్రస్తుత సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది చాలా కీలకమైన ఘటన’ అంటూ పరోక్షంగా చైనాకు వార్నింగ్‌ ఇచ్చారు రాజ్‌నాథ్‌. అంతేకాక ‘ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతల సమయంలో ఐఏఎఫ్‌ చూపించిన సమయస్ఫూర్తిని, నిబద్ధతని ఈ సందర్భంగా నేను ప్రశంసిస్తున్నాను. సరిహద్దులో మోహరించిన వాయుసేన దళాలను చూస్తే.. వారు ఏలాంటి పరిస్థితిని ఎదుర్కొగలరని.. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే.. ఐఏఎఫ్‌ కీలక నిర్ణయాధికారిగా ఉంటుందని’ అన్నారు రాజ్‌నాథ్‌. (చదవండి: రఫేల్‌... గేమ్‌ చేంజర్)

దేశంలోని పురాతన వైమానిక దళ స్థావరం అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫోరెన్స్‌ పార్లీ, డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ పాల్గొన్నారు. భారత్ ‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్‌ యుద్ధ విమానాల కోసం భారత్‌ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ రఫేల్‌ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫేల్‌ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం మరింత బలోపేతమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top