మ‌రో పెళ్లికి సిద్ధ‌మైన ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబి.. ఇన్‌స్టాలో పోస్టులు

Rajasthan IAS Officer Tina Dabi Gets Engaged To Fellow IAS Officer Again - Sakshi

అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్‌ అధికారిణి టీనా దాబి(28) మరోసారి వార్తల్లో నిలిచారు. రెండోసారి వివాహానికి ఆమె సిద్ధమయ్యారు. మరో ఐఏఎస్‌ అధికారితో తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్‌ మీడియాలో టీనా దాబి స్వయంగా షేర్‌ చేశారు. 

టీనా దాబి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘నువ్వు ఇచ్చిన నవ్వు..’ అంటూ క్యాప్షన్‌ ఉంచారామె. అలాగే ఆమె కాబోయే భర్త, రాజస్థాన్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ గవాన్డే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్‌ చేశారు.  ‘కలిసిఉంటే..’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఏప్రిల్‌ 22న రాజస్థాన్‌లో వీళ్ల వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రదీప్‌ ప్రస్తుతం ఆర్కియాలజీ, మ్యూజియమ్స్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  టీనా దాబి ప్రస్తుతం రాజస్థాన్‌ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్‌ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

రాజస్థాన్‌కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్‌ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచిన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్‌ సర్వీసెస్‌ ఎంట్రెన్స్‌లో టాపర్‌. రెండో ర్యాంకర్‌ అథర్‌ అమీర్‌ ఖాన్‌. వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు 2016లో సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు.  

2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్‌ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు.  అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట.. కిందటి ఏడాది జైపూర్‌ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది. 

తాజాగా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్‌ బ్యాచ్‌. గ్లామర్‌ ఉన్న ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు ఫాలోయింగ్‌ ఎక్కువే.  టీనా దబీకి సుమారు మిలియన్‌న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్‌ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top