సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Railways, Air Force being deployed to reduce transportation time for oxygen tankers - Sakshi

వైమానిక దళం, రైల్వే సేవల వినియోగం

ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఎక్కడా ఆగిపోకుండా చూడండి

11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమీక్ష  

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు అవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్‌) రవాణాలో వేగం పెంచామని, ఇందులో భాగంగా వైమానిక దళం, రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఆక్సిజన్‌ కొరతపై ముఖ్యమంత్రుల విజ్ఞప్తులను మోదీ ఆలకించారు. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే వనరుల కొరత అనే మాటే ఉండదని తేల్చిచెప్పారు.

పారిశ్రామిక ఆక్సిజన్‌ను కూడా తక్షణ అవసరాలకు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌గా మార్చి, ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు గుర్తుచేశారు. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్‌ అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలు కలిసి పనిచేయాలని,  సమన్వయం చేసుకోవాలని ప్రధాని కోరారు. ఆక్సిజన్, అత్యవసర ఔషధాల అక్రమ నిల్వ, బ్లాక్‌ మార్కెటింగ్‌పై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఎక్కడా ఆగిపోకుండా  పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ సరఫరా తీరును  పరిశీలించేందుకు ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.  ఆక్సిజన్‌ ట్యాంకర్ల ప్రయాణ సమయాన్ని, ఖాళీ ట్యాంకర్లు వెనక్కి వచ్చే సమయాన్ని తగ్గించడానికి   అన్ని అవకాశాలను పరిశీలించి, అమలు చేస్తున్నామన్నారు.  

 

ఏమీ చేయలేకపోతున్నా: కేజ్రీవాల్‌
ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా కల్లోలాన్ని సీఎం కేజ్రీవాల్‌ ప్రధానికి నివేదించారు. ‘‘పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రజలను వారి చావుకు వారిని వదిలేయలేం. ఢిల్లీ ప్రజల తరపున చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. వెంటనే తగిన చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. కొన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్‌ రావాల్సి ఉండగా.. ఆ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల్లో ఆపేస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు ఒక్క ఫోన్‌ చేయండి.ఆ వాహనాలను ఆపొద్దని చెప్పండి. ముఖ్యమంత్రి అయి ఉండీ ఏం చేయలేకపోతున్నా. కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు ఒక జాతీయ ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళికలో అన్ని ఆక్సిజన్‌ ప్లాంట్లను ఆర్మీ రక్షణలో ఉంచాలి’’ అని కోరారు. అయితే, ఈ సమావేశానికి సంబంధించి కేజ్రీవాల్‌ ప్రసంగాన్ని ఢిల్లీ ప్రభుత్వం మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తప్పుపట్టాయి.   గతంలో కూడా సమావేశాలు ప్రసారమయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం గుర్తుచేసింది. ఒకవేళ ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు విచారం వ్యక్తంచేస్తున్నామని పేర్కొంది.

పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆక్సిజన్‌ అవసరం చాలా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. డిమాండ్‌ను తీర్చడానికి పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయాలని ఆక్సిజన్‌ ఉత్పత్తిదారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్సిజన్‌ ఉత్పత్తిదారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. సవాళ్లతో కూడిన ఈ సమయంలో తగిన పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. ప్రభుత్వం, ఆక్సిజన్‌ ఉత్పత్తిదారుల మధ్య సమన్వయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వైద్య అవసరాలను తీర్చడానికి పారిశ్రామిక ఆక్సిజన్‌ను మళ్లించడం గొప్ప పని అని కొనియాడారు.  ఆక్సిజన్‌ సరఫరా కోసం ఇతర వాయువులను రవాణా చేయడానికి ఉద్దేశించిన ట్యాంకర్లను ఉపయోగించుకోవాలన్నారు. ఆక్సిజన్‌ చేరవేతకు రైల్వేలు, వైమానిక దళం సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని గుర్తుచేశారు. ప్రభుత్వం, రాష్ట్రాలు, పరిశ్రమలు, రవాణాదారులు, అన్ని ఆస్పత్రులు ఏకతాటి పైకి వచ్చి కలిసి పని చేయాలన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top