CM Stalin Autobiography: నేనూ తమిళ బిడ్డనే..! ఈ భూమిలో మా రక్తం కలిసి ఉంది..

Rahul Gandhi Releases CM Stalin Autobiography Ungalil Oruvan Book - Sakshi

‘మీలో ఒకడిని’ స్టాలిన్‌ పుస్తకావిష్కరణ సభలో రాహుల్‌గాంధీ 

హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు

సాక్షి , చెన్నై: ‘నేను తమిళ బిడ్డనే, మా రక్తం ఈ భూమిలో కలిసి ఉంది’.. అని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ‘మీలో ఒకడిని’ పేరుతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రచించిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నై నందంబాక్కంలోని ట్రేడ్‌ సెంటర్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగింది. రాహుల్‌గాంధీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ‘‘ఇటీవలి పార్లమెంట్‌ సమావేశాల్లో తమిళనాడు గురించే ఎక్కువ సేపు మాట్లాడి నేనూ తమిళుడనని చాటుకున్నాను. ఎందుకంటే నా తండ్రి రాజీవ్‌ గాంధీ రక్తం ఈ భూమిలో కలిసి పోయింది.

ఇక్కడి సంస్కృతి, సంప్రదాయం, నాగరికతను గౌరవిస్తూ తమిళనాడుకు వచ్చాను. అందుకే తమిళ పౌరుడనని చెప్పుకునేందుకు నాకు అర్హత ఉంది.  ప్రధాని మోదీ తమిళనాడుకు వచ్చినప్పుడు తన భావాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. మూడు వేల ఏళ్ల చారిత్రాత్మక నేపథ్యం కలిగిన తమిళనాడుపై ఎవ్వరూ ఆధిపత్యం చెలాయించ లేరు. దేశం, రాష్ట్రాల చరిత్రను తెలుసుకోకుండా ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రధాని సిద్ధపడుతున్నారు.

స్టాలిన్‌ స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో రాహుల్‌ గాంధీ, పినరయి విజయన్, ఒమర్‌ అబ్దుల్లా తదితరులు 

ప్రేమాభిమానాలతో ఏదైనా సాధించుకోవచ్చు, పెత్తనంతో కాదు.. తమిళనాడు ప్రజల కోసం ఎన్నో సుధీర్ఘ పోరాటాలను సాగించి స్టాలిన్‌ ఈ దశకు చేరుకున్నారు. ఆయన జీవిత చరిత్రను ఆవిష్కరించడానికి ఈ ఒక్క పుస్తకం సరిపోదు. మరిన్ని సంపుటికలు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిత్య యవ్వనులుగా ఎలా ఉండగలుగుతున్నారో వివరించేలా ఒక పుస్తకం తీసుకురావాల్సి ఉంది’’ అని ఆయన     చమత్కరించారు. 

ఒకతల్లి బిడ్డల్లా.. 
కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ మాట్లాడు తూ, తమిళనాడు, కేరళ ప్రజలు ఒక తల్లి బిడ్డల వంటి వారని అభివర్ణించారు. ప్రస్తుతం దేశంలో సెక్యు లరిజం, ప్రజ్వాస్వామ్యం ఖూనీ అవుతోందని, కేంద్రం విభజించి పాలిస్తోందని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను, సహజ సిద్ధంగా సంక్రమించిన హక్కులను కాలరాస్తోందన్నారు. వీటి పరిరక్షణ కోసం సమష్టిగా పోరాడక తప్పదని చెప్పారు. బిహార్‌ ప్రతి పక్షనేత తేజస్వీయాదవ్‌ మాట్లాడుతూ, ప్రజలతో ఎలా మమేకం కావాలి, సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో స్టాలిన్‌ తన పుస్తకంలో స్పష్టం చేశారని అన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక రిజర్వేషన్ల అమలులో తమిళనాడు ప్రభుత్వం ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సిద్ధాంతాల ను బిహార్‌లో కూడా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టు కున్నట్లు తెలిపారు. స్టాలిన్‌ రచించిన ఈ పుస్తకం అతని రాజకీయ దూరదృష్టిని చాటిచెప్పిందని కొనియాడారు. జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రసంగిస్తూ, స్టాలిన్‌ జీవిత చరిత్ర పుస్తకంలో ఎలాంటి అభూతకల్పనా లేదన్నారు. తమిళ ప్రజల మనోభావాలు బాగా తెలిసిన స్టాలిన్‌ తొమ్మిది నెలల తన పాలనలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు.  

నా జీవిత పోరాటాలను.. 
చివరగా సీఎం స్టాలిన్‌ అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ నా తండ్రి కరుణానిధిలా మాట్లాడలేను, రాయలేను. కానీ ఆయన శైలిని దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఒక సీఎంగా కాదు. ఎప్పటికీ ప్రజల్లోని మనిషినే అని మరో సారి చాటేందుకే ఆ పుస్తకానికి మీలో ఒకరిని అనే పేరు పెట్టాను. 1953 నుంచి 1976 వరకు 23 ఏళ్ల పాటు నా జీవిత పోరాటాలను ఇందులో ప్రస్తావించాను. ప్రతి వ్యక్తికీ యవ్వన దశ ఎంతో ముఖ్యమైంది. ఆ సమయంలోనే తన జీవన లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. అయితే, నేను ఆ సమయంలో జైలు జీవితం గడిపాను.

నా లక్ష్య సాధనకు ఎలాంటి సాహసాలు చేయలేదు, ఆ అవసరం రాలేదు. గోపాలపురం ఇల్లే అన్నీ తానై నా జీవితాన్ని నడిపించింది. నా తండ్రి కరుణానిధి కూర్చున్న సీఎం కుర్చీలో కూర్చుంటానని ఏనాడూ అనుకోలేదు’’ అని చెప్పారు. డీఎంకే  మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిత్రపక్షాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నటుడు సత్యరాజ్‌ స్టాలిన్‌ పుస్తకంలోని ముఖ్యాంశాలను వివరించారు.  

12 రోజుల పాటూ జన్మదిన వేడుకలు  
సీఎం స్టాలిన్‌ జన్మదినాన్ని మార్చి 1వ తేదీన కోలాహలంగా జరుపుకోవడం పార్టీ శ్రేణులకు అలవాటు. అయితే ఈ ఏడాది స్టాలిన్‌ తొలిసారిగా సీఎం హోదాను చేరుకోవడంతో 12 రోజులపాటూ వేడుకలు నిర్వహించనున్నారు. మార్చి 1, 3, 5, 7,9, 11, 13, 17, 19, 21, 23 తేదీల్లో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు డీఎంకేతోపాటూ మిత్రపక్ష కాంగ్రెస్, వామపక్షాల నేతలు ఈ మేరకు హాజరుకానున్నారు. 

కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ భేటీ 
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్న రాహుల్‌గాంధీకి విమానాశ్రయంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పుస్తకావిష్కరణ ముగిసిన తరువాత చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పుర పాలక ఎన్నికల్లో గెలుపొందిన వారితో సమావేమై అభినందించారు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో చెన్నై నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణమయ్యా రు. రాహుల్‌ రాక సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top