హుగ్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మకానికి పెట్టారంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారంలో భాగంగా హుగ్లీ జిల్లాలోని శ్రీరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ద్వేషాన్ని, భయాన్ని నింపుతారు. ఇది ఎన్నికల పోరాటం కాదు.. సిద్ధాంతాల పోరాటం’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలపై తీవ్ర స్థాయిలో రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇద్దరివి.. అవినీతి, బెదిరింపులతో ఒకే రకమైన పాలన విధానాలు అంటూ ఆరోపించారు. మమతా బెనర్జీ.. మోదీ కంటే ఏమాత్రం తక్కువ అవినీతిపరురాలు కాదు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండూ భయాందోళనలు, అరాచక వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నాయని రాహుల్ అన్నారు.
‘‘మమతా నేరుగా బీజేపీతో పోరాడదు కాబట్టే ఈడీ కేసులు లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తనపై అనేక కేసులు నమోదు చేసింది.. కానీ మమతా బెనర్జీపై ఒక్క కేసు కూడా లేదు. ఆమె బీజేపీతో నేరుగా పోరాడకపోవడమే దీనికి కారణమంటూ రాహుల్ ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనను వరుసగా ఐదు రోజుల పాటు 55 గంటల సేపు ప్రశ్నించిందని గుర్తు చేస్తూ.. మమతా బెనర్జీని ఎన్ని గంటల పాటు విచారించారు?’’ అంటూ రాహుల్ ప్రశ్నించారు. తాను ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నానని, తన ఇంటిని లాక్కున్నారని, తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా తొలగించారని రాహుల్ చెప్పారు. "నాపై 36 కేసులు ఉన్నాయి. ప్రతి 10-15 రోజులకు ఒకసారి జార్ఖండ్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలకు కోర్టు కేసుల కోసం తిరగాల్సి వస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
‘‘కేవలం కాంగ్రెస్ మాత్రమే బీజేపీతో సైద్ధాంతికంగా పోరాడుతోందని, అందుకే మోదీ తనను, పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ఎప్పుడూ టార్గెట్ చేస్తారు. బెంగాల్ ఎన్నికలు ముగియనివ్వండి. ఆ తర్వాత మోదీ ఒక్క మాట కూడా మమతకు వ్యతిరేకంగా మాట్లాడరు. పశ్చిమ బెంగాల్‌లో పరిశ్రమలను మమత నాశనం చేశారు. నిరుద్యోగాన్ని పెంచారు ఆరోపించారు. బెంగాల్‌లో ఉద్యోగం రావాలంటే టీఎంసీలో బంధువులు ఉండాలి. లేకపోతే రాదు’’ అంటూ రాహుల్ విమర్శించారు.


