ఒడిశాలోని తల్సారీ బీచ్‌లో ఒక టీవీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ కన్నుమూయడం అత్యంత విషాదకరం. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
షూటింగ్ సమయంలో తన సహ నటి నీటిలో ఉన్న ఒక లోతైన గుంతలో పడిపోవడాన్ని గమనించిన రాహుల్, ఆమెను రక్షించే ప్రయత్నంలో స్వయంగా నీటిలో మునిగిపోయారు. మోకాలి లోతు నీటిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో, సముద్రపు అలల తాకిడికి మలయాళ నటి (సహ నటి) అదుపు తప్పి పడిపోయారు. ఆమె చీరలో ఉండటంతో నీటిలో చిక్కుకుపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆయన లోపలికి వెళ్లి మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షి తపన్ చెప్పారు
స్థానిక పడవ నడిపే వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ సాహసంగా ముందుకు అడుగు వేసినప్పటికీ, సముద్రపు అడుగుభాగం సమానంగా లేకపోవడం ఇసుక మూలంగా బయటకు రాలేకపోయారు. అంతేకాదు రాహుల్‌ను బయటకు తీసినప్పుడు ఆయన ప్రాణాలతోనే ఉన్నారని, కానీ శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తక్షణమేఅతన్ని బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాహుల్‌ను కాపాడలేకపోయారు. తల్సరి నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిఘా స్టేట్ జనరల్ ఆసుపత్రికి అతన్ని తరలించే సమయానికే మరణించినట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: గ్యాస్ కొరత : ఐఐటీ బాంబే అద్భుత ఆవిష్కారం
అనుమతి లేదు
ఈ ప్రమాదం విషయంలో భద్రతా పరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న విషయంపై అనుమతి తీసుకోలేదని, ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అధికారులంటున్నారు. స్పీడ్‌బోట్‌లో చిత్రీకరణ జరుపుతుండగా, బలమైన అలల కారణంగా వారు సముద్రంలో పడిపోయారని పోలీసులు తెలిపారు. తోటి మహిళా నటిని త్వరగా రక్షించినప్పటికీ, రాహుల్‌ను గుర్తించి నీటిలోంచి బయటకు తీయడానికి దాదాపు గంట సమయం పట్టిందని సమాచారం. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే, అక్కడ లైఫ్ గార్డులు, వైద్య బృందం ,రెస్క్యూ బోట్లు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళమని స్థానిక అధికారి చెప్పారు.
పోస్టుమార్టం నివేదిక
రాహుల్ ఊపిరితిత్తుల్లోకి ఉప్పు నీరు, ఇసుక వెళ్లడం వల్లే ఆయన మరణించినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది.42 ఏళ్ల రాహుల్ అరుణోదయ బెనర్జీ కేవలం నటుడిగానే కాకుండా, రచయితగా, పాడ్‌కాస్ట్ హోస్ట్‌గా కూడా సుపరిచితులు. ఆయన మరణం చిత్ర పరిశ్రమలో పెద్ద లోటును మిగిల్చింది.
ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?


