ప్రభుత్వాలకు మీరు మార్గదర్శకులు

President Kovind attends 51st Conference of Governors and LGs - Sakshi

ప్రజలతో మమేకం కావాలి

గవర్నర్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపు

రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మిత్రులుగా, మార్గదర్శకులుగా వ్యవహరించాలని మన దేశ రాజ్యాంగ రూపకర్తలు భావించారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. రాష్ట్రాల అభ్యున్నతి కోసం గవర్నర్లు సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో గురువారం రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్ల 51వ సదస్సులో రాష్ట్రపతి మాట్లాడారు.

ప్రజా సంక్షేమానికి, వారి సేవ కోసం కట్టుబడి ఉండాలన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలని ఉద్బోధించారు. ప్రజల్లో చైతన్యం పెంచడంలో, జాతీయ లక్ష్యాలను సాధించేగా దిశగా వారికి స్ఫూర్తినివ్వడంలో గవర్నర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గవర్నర్లు జిల్లాలకు వెళ్లాలని, జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను సందర్శించాలని రాష్ట్రపతి చెప్పారు. ప్రజల సహకారంతో బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని గవర్నర్లను కోరారు.

కరోనాపై పోరాటంలో చురుకైన పాత్ర  
ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ చిరస్మరణీయ పోరాటం సాగించిందని, ఇందులో గవర్నర్లు తమ వంతు సహకారం అందించారని కోవింద్‌ ప్రశంసించారు. ఈ పోరాటంలో వారు చురుగ్గా వ్యవహరించారని కొనియాడారు. దేశంలో కరోనా ఉధృతి సమయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులంతా అసాధారణ త్యాగం, అంకితభావంతో విధులు నిర్వర్తించారని గుర్తుచేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గవర్నర్ల సదస్సు దాదాపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తొలి
సదస్సు 1949లో రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.  

పథకాల అమలును పర్యవేక్షించాలి: వెంకయ్య
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి అమలులో గవర్నర్ల పాత్ర కీలకమని తెలిపారు. గవర్నర్‌ పదవిని కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిగా భావించకూడదని, రాష్ట్రానికి తొలి పౌరుడిగా ప్రజలకు సేవ చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సంస్కృతిని కాపాడడానికి తోడ్పాటునందించాలని గవర్నర్లకు వెంకయ్య పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వారధి: మోదీ
గవర్నర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గవర్నర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పొరుగు రాష్ట్రాల గవర్నర్లతోనూ తరచుగా భేటీ కావాలని, దానివల్ల ప్రజల సమస్యలు తెలుస్తాయని వెల్లడించారు. రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడుతూ ఉండాలని మోదీ వివరించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్ల మధ్య అనుసంధానం కోసం ఓ సంస్థాగత యంత్రాంగం ఉండాలన్నారు. ఒక రాష్ట్రంలో గవర్నర్‌ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల గవర్నర్లు సైతం అందిపుచ్చుకోవాలని కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top