ప్లేట్లెట్స్‌ బదులు బత్తాయి జ్యూస్‌.. రోగి మృతి.. ఆ ఆస్పత్రి సీల్‌

UP Prayagraj Juice Instead Of Platelets Incident Hospital Sealed - Sakshi

లక్నో: డెంగీ రోగికి ప్లేట్లెట్స్‌ బదులు పండ్ల రసం ఎక్కించి.. అతని మృతికి కారణమైన ఆస్పత్రిపై అధికారిక చర్యలు మొదలయ్యాయి. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆదేశాలనుసారం.. గురువారం రాత్రి ఆ ఆస్పత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈ నిర్లక్ష్యపూరిత ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 

ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్‌ హస్పిటల్‌ అండ్‌ ట్రామా సెంటర్‌ను అధికారులు సీజ్‌ చేశారు. అంతేకాదు.. బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు  బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రయాగ్‌రాజ్‌ కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఖాత్రి స్పష్టం చేశారు. మరోవైపు పేషెంట్‌ బంధువులు ప్రభుత్వాసుపత్రి నుంచి తెచ్చిన ప్లేట్లెట్స్‌ బ్యాగులనే తాము ఉపయోగించామని, విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు చెప్తున్నారు. 

32 ఏళ్ల వయసున్న బాధితుడిని డెంగీ కారణంగా జీహెచ్‌టీసీలో చేర్పించారు. ప్లేట్లెట్స్‌ కౌంట్‌ తగ్గిపోవడంతో.. ఐదు యూనిట్‌ల ప్లేట్లెట్స్‌ ఎక్కించాలని సిబ్బంది ప్రయత్నించారు. మూడు యూనిట్లు ఎక్కించేసరికి వికటించడంతో.. పేషెంట్‌పై ప్రభావం పడింది. దీంతో మిగతావి ఎక్కించడం ఆపేశారు. ఈలోపు పరిస్థితి విషమించడంతో.. బంధువులు అతన్ని పక్కనే ఉన్న మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ కన్నుమూశాడు. 

ప్లేట్లెట్స్‌ బ్యాగు నకిలీదని, బత్తాయిలాంటి జ్యూస్‌లతో నింపేసి ఉన్నారని రెండో ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బంది బాధిత కుటుంబంతో చెప్పారు. దీంతో జీహెచ్‌టీసీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అన్యాయంగా తన సోదరి భర్తను పొగొట్టుకుందని.. యోగి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని  సౌరభ్‌ త్రిపాఠి అనే బంధువు వాపోతున్నాడు. 

ఇక ఘటన దుమారం రేపడంతో.. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాథక్‌ స్పందించారు. ఆస్పత్రి నుంచి వైరల్‌ అయిన వీడియోపై దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఆస్పత్రికి సీజ్‌ వేయమని ఆదేశించాం. మరోవైపు ప్లేట్లెట్‌ ప్యాకెట్లను పరీక్షల కోసం పంపించాం అని పాథక్‌ ప్రకటించారు. మరోవైపు ప్లేట్లెట్స్‌ బ్యాగుల్లో పండ్ల రసాలను నింపి సప్లై చేస్తున్న ముఠాల గురించి కథనాలు వస్తుండడంతో దర్యాప్తు ద్వారా విషయం తెల్చేయాలని యోగి సర్కార్‌ భావిస్తోంది.

ఇదీ చదవండి: భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top