పోలీసుగా విధులు.. సెలవుల్లో టీచర్‌గా పేద పిల్లలకు పాఠాలు

UP Police Starts Own School To Help Underprivileged Children - Sakshi

లక్నో:  పోలీసు ఉద్యోగం అంటేనే 24 గంటలు డ్యూటీ. క్షణం తీరిక లేని పని. ఎప్పుడైనా సెలవు దొరికితే కుటుంబంతో గడపాలనుకుంటారు. కానీ, ఓ పోలీసు అధికారి తన బాధ్యతలను నిర్వరిస్తూనే.. సెలవు రోజుల్లో టీచర్‌ అవతారమెత్తి పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. సొంతంగా పాఠశాల ఏర్పాటు చేసి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వారికి కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ తానే అందిస్తున్నారు. ఆయనే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన ఎస్సై రంజిత్‌ యాదవ్‌. 

నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు ఎస్సై రంజిత్‌ యాదవ్‌. ఉన్నత చదువులు చదవుకోవాలనే కోరికను వారిలో కలిగిస్తున్నారు. ఆయన చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్న చిన్నారులు.. తదుపరి తరగతులకు వెళ్తామని చెబుతున్నారు.' మేము ఇంకా చదువుకోవాలి. స్కూల్‌కు వెళ్లాలి. ఇక్కడ చదువుకోవడం వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక్కడికి రోజూ వస్తాము.' అని ఓ చిన్నారి పేర్కొంది. బహిరంగ ప్రదేశంలో, ఓ చెట్టు నీడలో తరగతులు నిర్వహిస్తున్నారు. 

తాను నివాసముండే ప్రాంతంలో కొన్ని కుటుంబాలకు చెంది వారు, పిల్లలు బిచ్చమెత్తుకుంటూ కనిపించగా వారికి చదువు చెప్పించి మార్పు తీసుకురావాలనే ఆలోచన వచ్చినట్లు రంజిత్‌ యాదవ్‌ తెలిపారు. కొద్ది నెలల క్రితమే తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ‘నా సొంత పాఠశాలను ప్రారంభించాను. నాకు సెలవు దొరికినప్పుడల్లా ఈ పిల్లలకు పాఠాలు బోధిస్తాను. వారి తల్లిదండ్రులు బిచ్చమెత్తుకుంటూ కనిపించటాన్ని చూసిన తర్వాత వారితో మాట్లాడాను. వారు పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు.’ అని తెలిపారు. ఆ పాఠశాలకు 50 మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వారికి అవసరమైన సామగ్రి, పుస్తకాలను పోలీసు అధికారే ఉచితంగా అందిస్తున్నారు.

ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top