బిచ్చగాడు అనుకుని సాయం.. అంతలోనే ఆశ్చర్యం!

Police Find Missing Batchmate Begging On Road Madhya Pradesh - Sakshi

దయనీయ పరిస్థితుల్లో ఉన్న బ్యాచ్‌మేట్‌ను ఆదుకున్న డీఎస్పీలు

భోపాల్‌: ‘‘తనను మాట్లాడించేందుకు మేం ఎంతగానో ప్రయత్నించాం. కానీ తను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. కాస్త దూరం వెళ్లగానే ఆ వ్యక్తి మమ్మల్ని ఇంటి పేర్లతో పిలవగానే షాకయ్యాం’’ అంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన క్రైంబ్రాంచ్‌ డీఎస్పీ విజయ్‌ సింగ్‌ భదోరియా తమకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకొచ్చారు. తమ స్నేహితుడిని ప్రస్తుతం ఓ ఆశ్రమానికి తరలించామని, త్వరలోనే తను కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. విజయ్‌ సింగ్‌ భదోరియా, ఆయన సహచర డీఎస్పీ రత్నేష్‌ సింగ్‌ తోమర్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ నేపథ్యంలో నవంబరు 11న గ్వాలియర్‌లో విధులు ముగించుకుని ఇంటికి పయనమయ్యారు. 

ఈ క్రమంలో రోడ్డుపై అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న యాచకుడిని చూసి చలించిపోయారు. చెత్తకుప్ప వద్ద తచ్చాడుతున్న అతడికి భోజనం పెట్టించారు. చలికి వణుకుతున్న యాచకుడికి భదోరియా తన వద్ద ఉన్న జాకెట్‌ ఇవ్వగా, తోమర్‌ తన బూట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అతడి వివరాల గురించి ఆరా తీశారు. అయితే తొలుత వారితో మాట్లాడేందుకు నిరాకరించిన ఆ బిచ్చగాడు, వారు వెనుదిరగగానే ఇంటి పేర్లు పెట్టి పిలవడంతో ఆశ్చర్యంలో మునిగిపోయారు. మా గురించి నీకెలా తెలుసంటూ ప్రశ్నల వర్షం కురిపించగా... అతడి ప్లాష్‌బ్యాక్‌ గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. గతంలో తమతో పాటు పోలీసు శిక్షణలో పాల్గొన్న స్నేహితుడే ఈ బిచ్చగాడు అని తెలుసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.  ఎస్సైగా పనిచేసిన మనీష్‌ మిశ్రాకు పట్టిన దుస్థితి తెలిసి భావోద్వేగంతో అతడిని అక్కున చేర్చుకున్నారు.(చదవండి: భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు)

ఈ విషయం గురించి డీఎస్పీ భదోరియా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మనీష్‌.. అందగాడు మాత్రమే కాదు. మా బ్యాచ్‌లోని 250  మందిలో గల టాప్‌ 10 షార్‌‍్ప షూటర్లలో అతనొకడు. మంచి అథ్లెట్‌ కూడా. వివిధ జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో ఇంచార్జిగా పనిచేసిన అనుభవం తనకు ఉంది. తనకు 2005లో దాటియాలో పోస్టింగ్‌ వచ్చింది. అదే తన గురించి మాకు తెలిసిన చివరి సమాచారం. ఇదిగో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ తనను చూశాం. మనీష్‌ తండ్రి కూడా పోలీసుగా పనిచేశారు’’అని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. 

మనీష్‌కు పెళ్లైందని, బహుశా ఆయన మానసిక పరిస్థితి దృష్ట్యా భార్య విడాకులు ఇచ్చి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. మనీష్‌ పెద్దన్నయ్య కూడా గుణ జిల్లాలో పోలీసు అధికారిగా పనిచేస్తున్నారని, ఆయన ద్వారా తమ స్నేహితుడి గురించిన పూర్తి సమాచారం తెలుసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనను షెల్టర్‌ హోంకు తరలించి, సైకియాట్రిస్టులతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నామని, మనీష్‌ త్వరలోనే మామూలు మనిషి అవ్వాలని ఆకాంక్షించారు.(చదవండి: అక్కడ హాయిగా పానీపూరీ లాగించేయవచ్చు!)

ఇక మరో డీఎస్పీ తోమర్‌, మనీష్‌ గురించి చెబుతూ.. మానసిక పరిస్థితి సరిగా లేనందు వల్ల విధులు సరిగా నిర్వర్తించలేకపోవడంతో ఉద్యోగం నుంచి అతడిని తొలగించినట్లు తెలిసిందన్నారు. ఆ తర్వాత మనీష్‌ను అతడి కుటుంబ సభ్యులు తమ స్వస్థలానికి తీసుకువెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయిందని, తరచుగా ఇంటి నుంచి పారిపోయేవాడని, అలా ఓ రోజు మొత్తానికే కనిపించకుండా పోయాడని వాళ్లు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మనీష్‌ను స్వర్గ్‌ సదన్‌ అనే ఆశ్రమంలో చేర్పించామని, ఆయన పరిస్థితి మెరుగయ్యేంత వరకు తామే బాధ్యత వహిస్తామని పెద్ద మనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ కథనానికి సంబంధించిన విశేషాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top