
ముంబై: మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Maharaj) వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ (chhatrapati sambhaji maharaj) గురించి వీకీపీడియా అభ్యంతరకర పోస్టు పోస్టు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం(21-02-2025) వీకీపీడియాకు చెందిన 4-5 ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇటీవల వీకీపీడియా ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి తప్పుడు సమాచారం పోస్టు చేసిందని, వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు అమెరికాకు చెందిన వీకీపీడియా మాతృసంస్థ వీకీమీడియా ఫౌండేషన్‌కు నోటీసులు జారీ చేశారు.
15 ఈమెయిల్స్ పంపినా ఇంత వరకూ వీకీమీడియా ఫౌండేషన్ నుంచి ఎలాంటి స్పందనరాలేదు. దీంతో వీకీపీడియా శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతరకర కంటెంట్ పోస్టు చేసిందని, ఆ కంటెంట్ వల్ల శాంతిభద్రతకు విఘూతం కలిగే అవకాశం ఉందని సైబర్ సెల్ పోలీసులు వీకీపీడియా ఎడిటర్లపై కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 69,79 ఉల్లంఘించినందుకు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ (Chhaava)
విడుదల నేపథ్యంలో వికీపీడియా కంటెంట్‌పై అభ్యంతరాలు వచ్చాయి. మరాఠాలు ఇదే విషయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. చారిత్రక వాస్తవాలను వక్రీకరించే కంటెంట్‌ను సహించబోమని, వీలైనంత త్వరగా వికీపీడియాను సంప్రదించాలని సైబర్ సెల్ పోలీసుల్ని ఆదేశించారు.
మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు.