తల్లి హీరాబెన్ అంటే ప్రధాని మోదీకి ఎంత ప్రేమో.. ప్రతి పుట్టినరోజున కాళ్లు మొక్కి.. ఆప్యాయంగా..

PM Narendra Modi Mother Heeraben Modi Passes Away - Sakshi

న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో కన్నతల్లిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పిల్లలపై తల్లి చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మాతృమూర్తిపై కుమారుడు చూపించే ప్రేమ వర్ణించలేనిది. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన తల్లి హీరాబెన్ మోదీపై అమితమైన ప్రేమ. ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే అనే నానుడి ఆయనకు సరిగ్గా సరిపోతుంది. మిగతా రోజుల్లో ఎక్కడున్నా.. తన పుట్టినరోజు వచ్చిందంటే మాత్రం మోదీ కచ్చితంగా ఆమె దగ్గరకు వెళ్తారు. ఆప్యాయంగా మాట్లాడుతారు. ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆమెకు కానుకలు కూడా ఇస్తారు.
హీరాబెన్ మోదీ కూడా కుమారుడిపై తన ప్రేమను చూపించేవారు. పుట్టినరోజు నాడు మోదీకి స్వీట్లు తినిపించి ముద్దాడేవారు. తన కుమారుడు ప్రధాని అయిన విషయం మరిచి దాచుకోవడానికి తన దగ్గరున్న డబ్బులు కూడా ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి.

మోదీ ఎక్కడున్నా ముఖ్యమైన సమయాల్లో కచ్చితంగా తన తల్లి దగ్గరకు వెళ్తారు. పుట్టినరోజుతో పాటు ఎన్నికలకు ముందు ఆమె ఆశీర్వచనాలు తీసుకుంటారు. హీరాబెన్ మోదీ ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి గొప్పతనాన్ని, కుటుంబం కోసం చేసిన త్యాగాలను మోదీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. తన మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో తన తల్లి హీరాబెన్ పాత్ర ప్రధానమని మోదీ చెప్పారు.
తన తల్లి చిన్నతనం నుంచే ఎన్నోకష్టాలను, ఒడుదొడుకులను ఎదుర్కొందని మోదీ బ్లాగ్‌లో రాశారు. తన కుటుంబం వాద్‌నగర్‌లో మట్టిగోడలతో నిర్మించిన చిన్న ఇంట్లో నివసించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పరిశుభ్రత పట్ల తన తల్లి ఎంతో ప్రత్యేకంగా ఉండవారని వివరించారు. మోదీ తండ్రి దామోదర్‌దాస్ ముల్‌చంద్ మోదీ 1989లో క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుంచి తల్లి హీరాబెన్ మోదీ చిన్నకుమారుడి దగ్గరే ఉంటున్నారు.
ఇటీవలే 100వ పుట్టినరోజు చేసుకున్న హీరాబెన్ మోదీ గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. నిండు నూరేళ్లు జీవించిన తన తల్లి.. భగవంతుని చెంతకు చేరిందని మోదీ భావోద్వేగ సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తన తల్లిలో మూడు గుణాలున్నాయని, ఆమెను చూస్తే తనకు ఒక రుషి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి జీవించడం గుర్తుకు వస్తాయని ఎమోషనల్ అయ్యారు.
చదవండి: ప్రధాని మోదీకి మాతృ వియోగం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top