నిరంతరం రైతన్నకు మేలు

PM Narendra Modi inaugurates three development projects - Sakshi

ప్రధాని మోదీ ఉద్ఘాటన

గుజరాత్‌లో మూడు ప్రాజెక్టులు ప్రారంభం

అహ్మదాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. రైతులకు ఇబ్బందులు లేకుండా దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఆయన శనివారం గుజరాత్‌లో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రాజెక్టులను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కాలానుగుణంగా ప్రయత్నాలను మరింత పెంచాల్సి ఉందని మోదీ అన్నారు. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవడానికి అవకాశం కల్పించడం, వేలాది రైతు ఉత్పాదక సంస్థలను సృష్టించడం, మధ్యలోనే ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, పంటల బీమా పథకాన్ని మెరుగుపర్చడం, 100 శాతం వేప పూత యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, సాయిల్‌ హెల్త్‌ కార్డులు.. వీటన్నింటి లక్ష్యం వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడమేనని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఇలాంటి చర్యలతో రైతాంగానికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. మన రైతన్నలకు మేలు చేసే చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

అక్కడ సౌకర్యాలు కల్పిస్తే..
గుజరాత్‌ ప్రభుత్వం అమలు చేయనున్న కిసాన్‌ సూర్యోదయ యోజన(కేఎస్‌వై)ను ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యవసాయ రంగానికి పగటి పూట విద్యుత్‌ సరఫరా చేస్తారు. గిర్నార్‌ కొండపై ఏర్పాటు చేసిన రోప్‌వే ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల ఈ రోప్‌వే రాష్ట్రంలో పర్యాటకులను ఆకట్టుకుంటుందని అధికారులు చెప్పారు. ఇది ఆసియాలోనే పొడవైన రోప్‌వే. పర్యాటక ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని చెప్పారు.

ప్రపంచానికి దారి చూపుతున్న భారత్‌
సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో భారత్‌ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో ఆరో స్థానానికి చేరిందన్నారు. గత ఆరేళ్లలోనే ఈ ఘనత∙సాధ్యమైందన్నారు. ‘ఒక సూర్యుడు.. ఒక ప్రపంచం.. ఒక గ్రిడ్‌’ విషయంలో ప్రపంచానికి భారత్‌ దారి చూపుతుందని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. కిసాన్‌ సూర్యోదయ యోజన కింద వ్యవసాయానికి సూర్యోదయం నుంచి ఉదయం 9.30 గంటలకు వరకు కరెంటు సరఫరా చేస్తారని, దీనివల్ల లక్షలాది మంది రైతుల్లో పెనుమార్పులు రావడం ఖాయమన్నారు. పగటి పూటే కరెంటు సరఫరా ఉంటుంది కాబట్టి సూక్ష్మ సేద్యం ప్రారంభిస్తే వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తాయని రైతులకు సూచించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top