దేశ భవితను తీర్చిదిద్దేది నగరాలే

PM Narendra Modi flags of Gandhinagar to Mumbai Central Vande Bharat Express train - Sakshi

గాంధీనగర్‌–ముంబై మధ్య వందేభారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో ఇది మూడో రైలు  

అహ్మదాబాద్‌: భారత్‌ భవిష్యత్‌ను నగరాలే తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చడానికి నగరాలే కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వాణిజ్య డిమాండ్‌కి అనుగుణంగా కొత్త నగరాలను దేశంలో నిర్మిస్తున్నామని చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి మహారాష్ట్రలో ముంబై మధ్య నడిచే సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్, అహ్మాదాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌–1ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం అక్కడికి వచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

  గాంధీనగర్‌–అహ్మదాబాద్‌ జంట నగరాలుగా మారి అద్భుతమైన అభివృద్ధిని సాధించాయన్నారు. ‘‘మారుతున్న కాలానికి తగ్గట్టుగా నగరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని నగరాల్లో అధికంగా దృష్టి సారించి పెట్టుబడులు భారీగా పెడుతున్నాము. వచ్చే 25 ఏళ్లలో ఈ నగరాలే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుపుతాయి’’ అని మోదీ అన్నారు. నగరాల అభివృద్ధితో పాటు ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్‌ సిటీలుగా రూపురేఖలు మార్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గాంధీ నగర్‌లో ఉదయం 10.30 గంటలకి మోదీ పచ్చ జెండా ఊపి వందేభారత్‌ రైలుని ప్రారంభించారు.

ఆ తర్వాత అదే రైల్లో నగరంలోని ఆహ్మదాబాద్‌లోని కాలూపూర్‌ రైల్వేస్టేషన్‌ వరకు మోదీ ప్రయాణించారు. ‘‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాని మోదీ ప్రయాణించారు. రైల్వే సిబ్బంది కుటుంబసభ్యులు, మహిళా వ్యాపారవేత్తలు, యువతీయువకులు ఆయన తోటి ప్రయాణికులుగా ఉన్నారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశంలో ఇది మూడో వందేభారత్‌ రైలు. 2019లో మొట్టమొదటి రైలు న్యూఢిల్లీ–వారణాసి మధ్య ప్రారంభం కాగా, రెండో రైలు  న్యూఢిల్లీ–శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా మార్గంలో ప్రారంభమైంది. అహ్మదాబాద్‌ నుంచి గాంధీనగర్‌కి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో ఒక అంబులెన్స్‌కి దారి ఇవ్వడానికి ఆయన కాన్వాయ్‌ని నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కవచ్‌ టెక్నాలజీతో భద్రతా వ్యవస్థ
వందేభారత్‌ రైలులో రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదాన్ని నివారించడానికి దేశీయ కవచ్‌ టెక్నాలజీని వినియోగించారు. పూర్తి ఎయిర్‌ కండిషన్‌ సదుపాయంతో పాటు ఆటోమేటిక్‌ తలుపులు, ప్రతీ సీటు దగ్గర మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు,అటెండెంట్‌ను పిలవడానికి కాల్‌ బటన్, బయో టాయిలెట్లు, సీసీ కెమెరాలున్నాయి. గంటకి 160 కి.మీ. గరిష్ట వేగంతో రైలు ప్రయాణించగలదు.   శుక్రవారం  ఈ రైలు అయిదున్నర గంటల్లో ముంబైకి చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top