
యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ బుధ వారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన నాలుగు రోజులపాటు యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), మాల్దీవుల్లో పర్యటిస్తారు. తన పర్యటనతో ఆయా దేశాలతో మన దేశానికి సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మోదీ ఈ మేరకు సందేశం విడుదల చేశారు.
భారత్–యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని, ఇరుదేశాల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు మెరుగయ్యాయని వెల్లడించారు. కీలక రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఉద్ఘాటించారు. మోదీ యూకే పర్యటనలో కింగ్ చార్లెస్–3 సైతం కలుసుకుంటారు. యూకే అనంతరం ఆయన మాల్దీవులకు చేరుకుంటారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి కంటే ముందు ఆయనతో మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని మోదీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఎఫ్‌టీఏతో భారత్‌కు తీవ్ర నష్టం
భారత్–యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తో మన దేశానికి భారీ నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు. యూకే మేలు చేసేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఎఫ్‌టీఏపై దేశ ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎఫ్‌టీఏ కారణంగా భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) తీవ్రంగా నష్టపోతాయని స్పష్టంచేశారు. ఆటోమొబైల్, ఫార్మా స్యూటికలు రంగాలు సైతం నష్టపోతాయన్నారు. యూకే నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై సుంకాలను 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని జైరామ్ రమేశ్ తప్పుపట్టారు.