
వారణాసి: ఇప్పడు దేశమంతా ఒకటే చర్చ. భారత్ వస్తువులపై 25 శాతం సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపైనే అంతటా చర్చ. ఈ సుంకం ప్రభావం అనేది భారత్ ఎగుమతి చేసే ఏయే వస్తువులపై అధికంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయం.. భారత్ ఎకానమీపై ఎంత వరకూ ప్రభావం చూపుతుందనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే భారత్‌పై సుంకాల భారం అధికంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించిన రోజుల వ్యవధిలోనే అన్నంత పని చేశారు. పైకి భారత్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూనే సుంకాల భారాన్ని మోపారు. అదే సమయంలో పాకిస్తాన్ సుంకాల్లో సడలింపు ఇచ్చారు. ఇది భారత్‌పై ట్రంప్‌కు ఎంత ప్రేమో ఉందో అనేది అందరికి అర్ధమైపోయింది.
ఇదిలా ఉంచితే, ట్రంప్ సుంకాల భారాన్ని మోపిన వేళ.. భారత ప్రధాని దేశ ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు. గతంలో మోదీ ఎన్నో సందర్భాల్లో చెప్పిన ‘స్వదేశీ’( మేడ్ ఇన్ ఇండియా) అంశాన్ని మరొకసారి స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 2వ తేదీ) ఆయన లోక్‌సభ స్థానం వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు మోదీ. ప్రధానంగా స్వదేశీ వస్తువులపైనే ప్రధాని మోదీ ఎక్కువగా ప్రస్తావించారు.
‘మనం ఏదైనా కొనాలని నిర్ణయించుకున్నప్పుడు మనకు ఒకే ఒక ప్రమాణం ఉండాలి. ఒక భారతీయుడు కష్టపడి తయారు చేసిన వాటినే కొనబోతున్నాం అనే ప్రమాణం మాత్రమే ఉండాలి’ అని మోదీ ఉద్ఘాటించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి
‘నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నా భిన్నంగా ఉంది. ఎన్నో ఆటు పోట్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉంది. అనిశ్చితి వాతావరణంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతీ దేశం వారి స్వ ప్రయోజనాల కోసమే పని చేస్తుంది. మనం మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి అతి దగ్గర్లో ఉన్నాం. అదే సమయంలో ఆర్థిక ప్రయోజనాల విషయంలో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మన రైతులు, మన పరిశ్రమలు, యువతకు ఉపాధి తదితర అంశాలు దేశ ప్రయోజనాల్లో కీలకం కావాలి. అవన్నీ మనకు చాలా ప్రధానమైన వనరులు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు సాగుతోంది.
బాధ్యత అనుకోవాలి.. అలవాటు చేసుకోవాలి
ఈ సమయంలో మనపైన కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇది కేవలం మోదీకి మాత్రమే సంబంధించినది కాదు. ప్రతీ ఒక్కరూ భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఇందులో సామాన్యుడి దగ్గర్నుంచీ ప్రతీ ఒక్కరూ భారత్‌ను ఉన్నతంగా చూడాలని అనుకుంటున్నారు. మన లక్ష్యం నెరవేరాలంటే మనం స్వదేశీ వస్తువులపైనే దృష్టి సారించాలి. మన భారతీయుడు తయారు చేసిన వస్తువునే కొనడానికి మనం ఒక ప్రమాణం స్ఫూర్తిగా కట్టుబడి ఉండాలి. అది మన బాద్యత అనుకోవాలి. దీన్ని అలవరుచుకోవాలి’ అని మోదీ స్పష్టం చేశారు.
తాము విధించే సుంకాలతో భారత్ ఎకానమీ ఇక అతలాకుతలమే అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇది మోదీ ఇచ్చిన కౌంటర్‌గా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమకు అన్నింటికంటే దేశ ప్రయోజనాల ముఖ్యమని మోదీ స్పష్టం చేయడతో పాటు స్వదేశీ వస్తువులపైనే భారతీయులు దృష్టి సారించాలని ఇచ్చిన పిలుపు కచ్చితంగా ట్రంప్‌కు బదులిచ్చినట్లుగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.