
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’... ఈ తెలుగు పాట స్నేహానికున్న గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అన్ని బంధాల కన్నా స్నేహబంధం గొప్పదనేవారు కూడా ఉన్నారు. ‘స్నేహమంటే ఊపిరి కదరా’ అంటూ చెట్టపట్టాల్ వేసుకుని తిరిగేవారు కూడా మనకు కనిపిస్తారు. అయితే ఉన్నట్టుండి ప్రాణస్నేహితుడు కనుమరుగైతే.. ఏకాకిగా మిగిలిన ఆ స్నేహితుని పరిస్థితి ఏమిటి?.. అతని హృదయం ఎలా ద్రవిస్తుంది?.. తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లాల్సిందే..
ఇండోర్‌కు చెందిన ఒక వ్యక్తి తన ప్రాణ స్నేహితుని మృతి అనంతరం అతని అంత్యక్రియల ఊరేగింపులో కన్నీళ్లతో నృత్యం చేస్తున్న భావోద్వేగ దృశ్యం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మందసౌర్ జిల్లాలోని జవాసియా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అంబాలా ప్రజాపత్ తన ప్రాణ స్నేహితుడు సోహన్‌లాల్ జైన్‌కు ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని అతని అంత్యక్రియల సమయంలో నిలబెట్టుకున్నాడు.
2023 నుండి క్యాన్సర్‌తో పోరాడుతున్న జైన్, తన మరణానికి ముందు అంబాలాకు రాసిన ఒక లేఖలో.. తన మరణ సమయాన నిశ్శబ్దంగా కూర్చోవద్దని, దుఃఖంతో విచారించవద్దని, తన అంత్యక్రియల సమయంలో పండుగ జరుపుకోవాలని కోరాడు. జైన్ రాసిన ఆ లేఖలో ‘నేను ఈ ప్రపంచం నుంచి కనుమరుగైనప్పుడు కన్నీళ్లు వద్దు, నిశ్శబ్దం అంతకన్నా వద్దు, వేడుక చేసుకోవాలి. నా అంత్యక్రియల ఊరేగింపులో డప్పు శబ్ధాలకు అనగుణంగా నృత్యం చేస్తూ, నాకు వీడ్కోలు పలకాలి. విచారంతో, ఏడుపుతో నన్ను పంపించవద్దు. సంతోషంగా నాకు వీడ్కోలు చెప్పండి’ అని కోరాడు.
స్నేహితుని అభిలాషను గౌరవిస్తూ అంబాలా తన స్నేహితుని అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేశాడు. జలపాతంలా ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ, నృత్యం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని కట్టిపడేస్తోంది. ఫ్రీ ప్రెస్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం సోహన్‌లాల్ జైన్ ఏడాది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. జైన్ కుమారుడు ముఖేష్ మాట్లాడుతూ, తన తండ్రి చివరి కోరికను నెరవేర్చగలిగినందుకు అందరం సంతోషంగా ఉన్నామన్నారు.