
ఆ జంటకు పెళ్లై 16 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంతూరిలో ఇల్లు ఉండి కూడా.. సిటీలోనే కాపురం పెట్టాలన్న ఆమె కోరికను తీర్చాడా భర్త. అయినా ఎందుకనో ఆమె భర్తపై చంపేయాలన్నంత కసి పెంచుకుంది. భర్త హత్యకు గుండాలకు సుపారీ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో.. భర్త బతికిపోగా, ఆమె ప్లాన్ బయటపడింది.
భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య ఉదంతంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని ఓ ఆస్పత్రిలో రాజీవ్ పని చేస్తున్నాడు. జులై 21వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అతనిపై గుంపుగా వచ్చిన 11 మంది దాడి చేసి చితకబాదారు. అతని కాళ్లు, చేతులు విరగొట్టి కార్లలో సీబీ గంజ్ ఏరియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.
కనీసం సాయం కోసం అరవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు రాజీవ్. అక్కడే సజీవంగా పాతేయాలని గొయ్యి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు ఆ గుండాలు. ఇంతలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. ఆ బ్యాచ్‌ను చూసి గట్టి గట్టిగా కేకలు వేశాడు. దీంతో..
కంగారుపడిపోయిన ఆ దుండగులు రాజీవ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆపై ఆంబులెన్స్‌కు కాల్ చేసిన ఆ అపరిచితుడు.. రాజీవ్‌ను ఆస్పత్రిలో చేర్పించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజీవ్.. కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు. బహుశా.. దేవుడే ఆ ఆజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి తనను రక్షించి ఉంటాడని కన్నీటి పర్యంతం అవుతున్నాడు రాజీవ్.
రాజీవ్ తండ్రి ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాడి చేసిన 11 మందిలో రాజీవ్ సొంత బావమర్దులే ఐదుగురు ఉండడం విశేషం. రాజీవ్ భార్య సాధన ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. గత కొంతకాలంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే ఆమె భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలియాల్సి ఉంది. స్థానికులు ఆ భార్యభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధన, ఆమె సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!
ఇదీ చదవండి: పడక సుఖం ఇవ్వని భర్తను ఆ భార్య ఏం చేసిందంటే..