అవినీతిపరులను వదిలిపెట్టొద్దు

PM Narendra Modi addresses programme marking Vigilance Awareness week - Sakshi

అధికారులకు ప్రధాని మోదీ పిలుపు  

‘కంప్లైంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ పోర్టల్‌ ప్రారంభం  

సీవీసీ ఆధ్వర్యంలో విజిలెన్స్‌ అవగాహనా వారోత్సవం

న్యూఢిల్లీ:  అవినీతిని అరికట్టే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అవినీతి వ్యతిరేక సంస్థలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నీతిమాలిన వ్యవహారాలను నియంత్రించేటప్పుడు స్వార్థపరులు దర్యాప్తు సంస్థలకు మకిలి అంటించే ప్రయత్నం చేస్తుంటారని, సవాళ్లు ఎదురైనా ఆత్మరక్షణలో పడిపోవద్దని చెప్పారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్‌ అవగాహనా వారోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అవినీతిపరులు ఎంత గొప్పవారైనా సరే వదిలిపెట్టొద్దని సీవీసీతోపాటు ఇతర సంస్థలకు, అధికారులకు సూచించారు.

అక్రమార్కులు రాజకీయంగా, సామాజికంగా రక్షణ పొందకుండా చూడాల్సిన బాధ్యత సీవీసీలాంటి సంస్థలపై ఉందన్నారు. ప్రతి అవినీతిపరుడిని జవాబుదారీగా మార్చడం సమాజం విధి అని చెప్పారు. అలాంటి వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యమని తెలిపారు. తప్పుడు పనులకు పాల్పడినవారు ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రముఖులుగా చెలామణి అవుతూ యథేచ్ఛగా తిరుగుతున్నారని, జనం సైతం వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారని, మన సమాజానికి ఇలాంటి పరిణామం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు.  

ఆ జాడ్యాలను వదిలిస్తున్నాం..
సీవీసీ లాంటి సంస్థలు దేశ సంక్షేమానికి పాటుపడుతున్నాయని, నిజాయితీగా పని చేస్తున్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ చెప్పారు. మనం రాజకీయ అజెండాతో పనిచేయడం లేదని, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే మన బాధ్యత అని ఉద్బోధించారు. అవినీతి వ్యతిరేక సంస్థలు తమ ఆడిటింగ్, ఇన్‌స్పెక్షన్లను టెక్నాలజీ సాయంతో ఆధునీకరించుకోవాలని సూచించారు. అవినీతిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించడం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వ శాఖలు, విభాగాలన్నీ అవినీతిపై యుద్ధం చేయాలన్నారు.

దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతిని సహించలేని పరిపాలనా వ్యవస్థ కావాలన్నారు. ప్రభుత్వ అధినేతగా కొనసాగుతున్న తనపైనా ఎన్నోసార్లు బురద చల్లారని, దూషించారని తెలిపారు. నిజాయతీ, నిర్భీతిగా పనిచేస్తే ప్రజలు మన వెంటే మద్దతుగా నిలుస్తారని వివరించారు. బ్రిటిషర్ల పాలనలో ఆరంభమైన అవినీతి, దోపిడీ, వనరులపై గుత్తాధిపత్యం వంటి జాడ్యాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగాయని, గత ఎనిమిదేళ్లుగా సంస్కరణల ద్వారా వాటిని వదిలిస్తున్నామని, పాలనలో పారదర్శకతను ప్రవేశపెట్టామని వెల్లడించారు.    

ఫిర్యాదుల స్థితిగతులపై పోర్టల్‌
సీవీసీ ఆధ్వర్యంలో నూతన ‘కంప్లైంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. అవినీతిపై తాము ఇచ్చిన ఫిర్యాదుల స్థితిగతులను ఈ పోర్టల్‌ ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ‘ఎథిక్స్, గుడ్‌ ప్రాక్టీసెస్‌: కంపైలేషన్‌ ఆఫ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ ఆన్‌ ప్రివెంటివ్‌ విజిలెన్స్‌’ అనే అంశంపై పుస్తకాలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ‘అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతి రహిత భారతం’ అనే అంశంపై సీవీసీ దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులకు అవార్డులు అందజేశారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top