pm modi mann ki baat - covid 19 second wave Effect on India - Sakshi
Sakshi News home page

సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తోంది

Apr 26 2021 2:04 AM | Updated on Apr 26 2021 10:01 AM

PM Modis Mann Ki Baat Address: Top Quotes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మొదటి దశను విజయంవంతంగా ఎదుర్కొన్న తర్వాత దేశం ఆత్మవిశ్వాసాన్ని పొందినప్పటికీ ప్రస్తుత కరోనా తుపాను (సెకండ్‌ వేవ్‌) దేశాన్ని కుదిపేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల సహనానికి, బాధలను తట్టుకొనే శక్తికి సెకండ్‌ వేవ్‌ పరీక్ష పెడుతోందని అభిప్రాయపడ్డారు. ఆదివారం మన్‌కీబాత్‌ 76వ ప్రసంగంలో ప్రధాని మోదీ పూర్తిగా కరోనా మహమ్మారిపైనే దృష్టి కేంద్రీకరించారు. కరోనాకు సంబంధించిన పలు అంశాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కరోనాను జయించడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమన్నారు. ఈ సంక్షోభం నుంచి త్వరలోనే ప్రజలు బయటపడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘మన సన్నిహితులు, ఆత్మీయులు, బంధువులు ఎందరో మనల్ని అర్ధాంతరంగా వదిలివెళ్లారు. మొదటిదశను విజయవంతంగా ఎదుర్కొన్న తర్వాత మనమంతా ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. కానీ ఈ తుపాన్‌ దేశాన్ని కుదిపేసింది’ అని మోదీ అన్నారు. అందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, టీకాల విషయంలో వదంతులను నమ్మవద్దని కోరారు.  

రాష్ట్రాలు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి 
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సుదీర్ఘంగా చర్చించానన్నారు. ఔషధ పరిశ్రమ, టీకా తయారీదారులు, ఆక్సిజన్‌ ఉత్పత్తిలో నిమగ్నమైన వారు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్నవారు తమ విలువైన సలహాలను ప్రభుత్వానికి అందజేశారన్నారు. ఈ విపత్కర సమయంలో... ఈ యుద్ధంలో విజయం సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధీకృత సమాచారం పైనే ఆధారపడాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. సమీపంలోని వైద్యుడు లేదా కుటుంబ వైద్యుడిని సంప్రదించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది వైద్యులు ప్రజలకు సమాచారం ఇస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. టీకా గురించి ఎలాంటి వదంతులు నమ్మొద్దు. ఉచిత వ్యాక్సిన్‌ అన్ని రాష్ట్రాలకు పంపాం. 45 ఏళ్లు పైబడిన వారు అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు.

మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుంది. కేంద్రం నుంచి 45 ఏళ్ల పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్‌ అందజేసే కార్యక్రమం ఇకపై కూడా కొనసాగుతుంది. ఉచిత వ్యాక్సిన్‌ ప్రయోజనాలను వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని నేను రాష్ట్రాలను కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో భారత ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతలను నెరవేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనాపై భారీ పోరాటం చేస్తున్నారు. వీరితోపాటు ల్యాబ్‌–టెక్నీషి యన్లు, అంబులెన్స్‌ డ్రైవర్లు వంటి ఫ్రంట్‌లైన్‌ కార్మికులు కూడా ఆపత్కాలంలో దేవుళ్లలా పనిచేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు.  

‘‘పౌరులుగా జీవితంలో సాధ్యమైనంత సమర్థవంతంగా మన విధులను నిర్వర్తిస్తాం. సంక్షోభం నుండి బయటపడిన తరువాత మనం భవిష్యత్‌ మార్గంలో మరింత వేగంగా వెళ్తాం. ఈ కోరికతో మీ అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని  మరోసారి కోరుతున్నా. మనం పూర్తి జాగ్రత్తగా ఉండాలి. మందులు కూడా – కఠిన నియమాలు కూడా (దవాయీ భీ... కడాయీ భీ)... ఈ మంత్రాన్ని మర్చిపోకండి. ఈ విపత్తు నుంచి త్వరలో బయటికి వస్తాం’’ అని ప్రధాని ప్రసంగం ముగించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement