ఒక్క రోజులో 86 లక్షలకు పైగా టీకాలు వేసి చరిత్ర సృష్టించాం: మోదీ

PM Modi Urges India To Shed Vaccine Hesitancy In Mann Ki Baat - Sakshi

ఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'మన్‌ కీ బాత్‌' ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందని తెలిపారు. కరోనా వైరస్‌పై దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని మోదీ చెప్పారు. ఈ పోరాటంలో మనమంతా ఓ అసాధారణ విజయాన్ని సాధించామన్నారు. కొద్ది రోజుల క్రితం మునుపెన్నడూ లేని అద్భుతాన్ని మన దేశం సాధించిందన్నారు.

జూన్ 21న 86 లక్షల మందికి పైగా ఉచిత వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఒక రోజులో ఇంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం గొప్ప రికార్డు అని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్‌లోని బేటుల్ జిల్లా, దులేరియా గ్రామస్థులతో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్‌పై సందిగ్ధతను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు ఆయనకు తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ, వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. తన తల్లి వయసు సుమారు వందేళ్ళు ఉంటుందని, ఆమె కూడా రెండు డోసులను తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. 

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌పై మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు. రోడ్‌ టు టోక్యో క్విజ్‌లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరుపొందిన మిల్కా సింగ్‌ను మోదీ గుర్తు చేసుకున్నారు. 1964లో దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న మిల్కా తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడని.. ఆ స్థాయి ప్రదర్శనతోనే దేశ మన్ననలు పొందాడని తెలిపారు. కరోనా కారణంగా ఒక లెజెండరీ అథ్లెట్‌ను కోల్పోవడం బాధాకరమని మోదీ అభిప్రాయపడ్డారు.

చదవండి: డీఏను తక్షణమే పునరుద్ధరించాలి: కాంగ్రెస్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top