‘పీఎం–కిసాన్‌’ సొమ్ము విడుదల

PM Modi inaugurates Kisan Samman Sammelan in New Delhi - Sakshi

రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.16,000 కోట్లు 

బదిలీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 

‘భారత్‌’ బ్రాండ్‌ యూరియా, ‘ఇండియన్‌ ఎడ్జ్‌’ పత్రిక ఆవిష్కరణ

ఇక కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా 3.25 లక్షల రిటైల్‌ ఎరువుల దుకాణాలు 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం–కిసాన్‌) 12వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల ఆధ్వర్యంలో ప్రారంభమైన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌–2022 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 12వ విడతలో దాదాపు రూ.16,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి.

దీంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2.16 లక్షల కోట్ల సాయం అందించినట్లయ్యింది. ఏటా 11 కోట్ల మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కిసాన్‌ కింద అర్హులకు ప్రతి సంవత్సరం రూ.6,000 మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నాలుగో నెలలకోసారి రూ.2,000ను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది.  

రైతులపై తగ్గిన ఆర్థిక భారం  
మధ్యవర్తులు, కమీషన్ల ఏజెంట్ల ప్రమేయం లేకుండా పీఎం–కిసాన్‌ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖతాల్లోకే బదిలీ చేస్తున్నామని ప్రధానీ మోదీ వివరించారు. కిసాన్‌ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దీపావళి పండుగకు ముందు రైతులకు నిధులు అందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రబీ సీజన్‌లో పంటల సాగుకు ఈ డబ్బులు ఉపయోగపతాయని చెప్పారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్నదాతలకు రూ.2 లక్షల కోట్లకుపైగా అందజేశామని తెలిపారు. పీఎం–కిసాన్‌ పథకం ఆర్థికంగా ఎంతో భారాన్ని తగ్గించిందని రైతులు తనతో చెప్పారని గుర్తుచేశారు.  

కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు ప్రారంభం  
‘ఒకే దేశం, ఒకే ఎరువుల పథకం’లో భాగంగా ‘భారత్‌’ బ్రాండ్‌ రాయితీ యూరియాను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల ఆవిష్కరించారు. అలాగే 600 పీఎం–కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రెండు చర్యల వల్ల రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందుతాయని చెప్పారు. అంతర్జాతీయ ఎరువుల ఈ–వారపత్రిక ‘ఇండియన్‌ ఎడ్జ్‌’ను సైతం మోదీ ఆవిష్కరించారు. మార్కెట్‌లో వివిధ రకాల బ్రాండ్లు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని, అధిక కమీషన్‌ కోసం డీలర్లు కొన్ని రకాల బ్రాండ్లనే విక్రయిస్తున్నారని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి  ఏకైక బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.

ఖజానాపై ‘ఎరువుల’ భారం  
కిసాన్‌ సమృద్ధి కేంద్రాల్లో రైతులకు బహుళ సేవలు అందుతాయని తెలియజేశారు. ఇవి ‘వన్‌ స్టాప్‌ షాప్‌’గా పని చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 3.25 లక్షల రిటైల్‌ ఎరువుల దుకాణాలను కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఎరువుల కోసం మనం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, ఎరువులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్ల మేర రాయితీ భారం భరిస్తోందన్నారు. ఒక్కో కిలో ఎరువును రూ.80కి కొని, రైతులకు రూ.6కు అమ్ముతున్నామని చెప్పారు.

ఎరువులతోపాటు ముడి చమురు, వంట నూనెల దిగుమతుల భారం సైతం పెరుగుతోందన్నారు. దిగుమతుల బిల్లు తగ్గించుకోవాలని, ఎరువులు, వంట నూనెల ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించాలని, ఈ విషయంలో మిషన్‌ మోడ్‌లో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌లో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, మన్‌సుఖ్‌ మాండవియా తదితరులు పాల్గొన్నారు. 13,500 మందికిపైగా రైతులు హాజరయ్యారు. దాదాపు 1,500 వ్యవసాయ స్టార్టప్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను, నవీన ఆవిష్కరణలను ప్రదర్శించాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top