వీటి లక్ష్యసాధన కోసం నిబంధనలను సడలిద్దాం.. సంస్కరణలు తెద్దాం
ప్రభుత్వంలోని కీలక శాఖల కార్యదర్శులకు మోదీ ఉద్బోధ
ఈ దిశగా చేపడుతున్నచర్యల పురోగతిపై సమీక్ష
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాల వేళ భేటీపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సులభతర వాణిజ్యం, ప్రజల సౌకర్యవంతమైన జీవనానికి బాటలు పరిచేలా నిబంధనల సడలింపుతోపాటు ఆ మేరకు సంస్కరణలు తీసుకురావాలని ప్రధాని మోదీ ఉపదేశించారు. సెషెల్స్ దేశ పర్యటన ముగించుకుని వచ్చిన మరుసటి రోజే మోదీ అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయమైన ‘సేవా తీర్ధు’లో సమావేశమయ్యారు. సులభతర జీవనం, వాణిజ్యంతోపాటు ఆత్మనిర్భరతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆయా మంత్రిత్వశాఖలు చేపట్టిన కార్యక్రమాలు, ఆయా పథకాల పురోగతిపై కార్యదర్శులు మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మంత్రివర్గాన్ని మోదీ పునర్‌వ్యవస్థీకరించనున్నారని వార్తలు వెలువడుతున్న వేళ ఈ సమీక్ష సమావేశం జరగడంతో దీనికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని దార్శనికత, ఆమేరకు సఫలీకృతమైన విధాన నిర్ణయాలు, ఈ దిశలో కీలక రంగాల వారీగా ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కారానికి ఆచరణలో పెట్టిన వ్యూహాల పైనా ఈ సమీక్షా సమావేశంలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లక్ష్యాలను వేగంగా సాధించడంలో సమీకృత ప్రణాళిక, సమన్వయం అవసరమని ఆయా మంత్రిత్వశాఖల కార్యదర్శులకు మోదీ సూచించారు. శాఖల మధ్య అంతర్గత సమన్వయంతోపాటు విధానపర నిర్ణయాలు వేగంగా తీసుకునేలా పీఎం ‘గతిశక్తి’వేదికను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని మోదీ ఆదేశించారు.
సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేయడంపై దృష్టిపెట్టాలని ప్రధాని సూచించారు. పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ప్రోత్సహించడంలో సాధించిన పురోగతిపై సమీక్ష కోసమే ఈ భేటీ నిర్వహించినప్పటికీ మంత్రిత్వ శాఖల పనితీరుపై మోదీ ఈ భేటీలో ఆయా శాఖల కార్యదర్శులను ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని కార్యాలయం సహా కేబినెట్ మంత్రుల పనితీరుపై కూడా ఆయా ఉన్నతాధికారులు.. సహాయ మంత్రులపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విడివిడిగా కలిసిన నేపథ్యంలో, ఇప్పుడీ కార్యదర్శుల సమావేశం ముగిసిన వెంటనే త్వరలోనే మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండవచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. అవీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే ఉంటాయనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మేధోమథన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కీలకంగా మారిన క్షేత్రస్థాయి నివేదిక..
మంత్రిత్వ శాఖల పనితీరును సమీక్షించడం, రాబోయే నెలల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన సంస్కరణలపై అప్రమత్తం చేయడంతో పాటు మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశ వివరాలను ఆయా మంత్రిత్వ శాఖలకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ ఎప్పటికప్పుడు ఒక నోట్స్ రూపంలో పంపిస్తోంది. మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయడంలోనూ, పనితీరు మెరుగుపరుచుకోవడంలోనూ లోపాలు, ఆలస్యం అవుతున్నాయని ఈనెల 17న పంపిన మెమోరాండంలో స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో వికసిత్ భారత్–2047 లక్ష్యంగా ఏయే శాఖలో ఏయే కార్యక్రమాలు ఏవిధంగా జరుగుతున్నాయి, ఫైళ్లు నిర్దిష్ట కాలంలో పరిష్కారమవుతున్నాయా లేదా అనే తదితర అంశాలపై మంగళవారం నాటి సమావేశంలో మోదీ సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. ఇలాంటి అంతర్గత సమావేశాలలో వచ్చిన ఫీడ్‌బ్యాక్, అధికారుల నివేదిక ఆధారంగా ఏ మంత్రిత్వ శాఖ ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చలేదో గుర్తించి, ఆ తర్వాత జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయా మంత్రుల పోర్ట్‌ఫోలియోలను మార్చడమో లేదా కొత్తవారికి అవకాశం ఇవ్వడం మోదీ శైలి అని ఢిల్లీ రాజకీయ వర్గాలలో వాదనలు వినిపిస్తున్నాయి.
మోదీ తన గత రెండు విడతల ప్రభుత్వాలలో ముఖ్యంగా 2017, 2021 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలకు ముందు సైతం కేంద్ర మంత్రులతోనే గాకుండా, ప్రభుత్వ శాఖల ‘గ్రౌండ్ రిపోర్ట్’కోసం ఉన్నతాధికారులతో అంతర్గత సమీక్షలు నిర్వహించడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.


